అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీలందరికీ శుభాకాంక్షలతో
.
మేము గొప్పపనులు చేస్తే ప్రేమిస్తారు, శలవులకి ఇంటికి వచ్చినా,
లేక చెప్పలేని చోట గాయాలపాలై తిరిగొచ్చినా.
మీరు పతకాల్ని ఆరాధిస్తారు; మీకు గొప్ప నమ్మకం
యుద్ధంలోని కళంకాన్ని శౌర్యం కప్పిపుచ్చుతుందని.
మమ్మల్ని ఉక్కు కవచాల్లా తయారు చేస్తారు. మహాసంతోషంగా వింటారు,
మట్టికొట్టుకుపోతూ ప్రమాదాల్నెదిరించిన మా కథలకి పులకిస్తారు.
దూరంగా ఎక్కడో యుద్ధం చేస్తున్నపుడు మా లోపలి ఉద్రేకం మీరే
మేము మరణిస్తే, జ్ఞాపకాలను పచ్చగా ఉంచుకుంటూమరీ శోకిస్తారు.
నరకసదృశమైన ఉత్పాతం ఎదురైనపుడు, రక్తమోడుతూ
బ్రిటిషు సేనలు కూడా వెన్నిచ్చి వెనక్కి పరిగెడతాయనీ,ఆ పరుగులో
నేలమీది భీతావహమైన శవాల్ని తొక్కుకుంటూ పోతాయంటే మీరు నమ్మలేరు.
చలిమంట ప్రక్కన కలలుగంటున్న ఓ జర్మను మాతా!
నీ కొడుకుకి పంపిద్దామని మేజోళ్ళు అల్లుతున్నావు గానీ,
అతని ముఖం బురదలో లోతుగా చొచ్చుకుపోయింది తల్లీ!
.
సీ ఫ్రై ససూన్.
8 September 1886 – 1 September 1967
ఇంగ్లీషు కవి
యుద్ధోన్మాదం ఎంత ప్రమాదకరమో, ఎన్ని కలలు, కన్నీళ్ళు నేలపాలవుతాయో, కవులు కేవలం ఊహిస్తే, స్వయంగా యుద్ధరంగంలో పనిచేసిన సైనికుడిగా, కవితాహృదయంతో స్పందించి అనేక కవితలు వ్రాసేడు సీ ఫ్రై ససూన్.
ఒక చిన్న ఉపమానంతో ఎంత అందమైన బాధామయ చిత్రాన్ని ఆవిష్కరించాడో చూడండి. యుద్ధం ఎవరికి అన్యాయం చేసినా చెయ్యకపోయినా, స్త్రీలకు యుద్ధం ఎప్పుడూ అన్యాయమే చేస్తుంది… ఎటునుండి చూసినా.
.

Image Courtesy: http://www.spartacus.schoolnet.co.uk/Jsassoon.htm
స్పందించండి