లే! లే, మిత్రమా! పుస్తకాల్ని పక్కన పడెయ్. లేకపోతే నువ్వు రెండురెట్లు లావు అవుతావు. లే! లే, మిత్రమా! లేచి కళ్ళు తుడుచుకో! ఎందుకొచ్చిన శ్రమ ఇదంతా నీకు ?
చూడు, సూర్యుడు పడపటికొండ శిఖరాన ఎంత లావణ్యంతో మెరుస్తున్నాడో విశాలమైన ఈ పచ్చిక చేలమీద మనోహరంగా తన బంగారువన్నె నీరెండ పరుస్తున్నాడు.
ఆహ్, పుస్తకాలు! స్వారస్యంలేని ఆ గోల ఎప్పుడూ ఉండేదేలే, రా, చిట్టడవిలోని ఆ పిట్టపాట విను. ఎంత మధురంగా ఉంది ఆ పాట! నా మీద ఒట్టు, అందులో ఇంతకంటే ఎక్కువ వికాసము ఉంది.
అదిగో విను! కోకిల ఎంత తియ్యగా పాడుతోందో! అదేమీ తక్కువ తినలేదు ఉపదేశించగలగడంలో; ఆరుబయట వెలుగులోకి ఒకసారి అడుగుపెట్టు ప్రకృతిని నీ గురువుగా స్వీకరించు.
మన మనసుల్నీ, మేధనీ అనుగ్రహించడానికి వీలుగా ఆమెదగ్గర సిద్ధంగా ఎప్పుడూ అంతులేని సిరులుంటాయి, ఆరోగ్యంతో పాటు అవలీలగా అబ్బుతుంది తెలివి ఆనందం మనలో రగిలిస్తుంది సత్య స్ఫూర్తి.
వసంత ఋతువులోని ఏ తోట ఇచ్చే ప్రేరణైనా చాలు మనిషిగురించి ఎంతో ఎక్కువ తెలుసుకుందికి, మంచీ, చెడూ, విలువలగురించి తెలుస్తుంది ఏ ఋషులు చెప్పగలిగినదానికంటే ఎక్కువగా.
ప్రకృతి చెప్పే కథలు రమ్యంగా ఉంటాయి; మనం తొందరపాటుతో తెలివనుకుని చేసే జోక్యంతో వస్తువుల అందాన్ని చెడగొడతాము— పరీక్షల పేరుతో హత్యగావిస్తుంటాము.
చాలు ఇక ఈ విజ్ఞానమూ, కళాతృష్ణా ఆ నిష్ఫలమైన పేజీలు ఇక మూసెయ్యి, బయటకి రా, చూడగలిగి, అందుకోగలిగిన ఒక్క హృదయాన్ని మాత్రమే వెంట తీసుకురా.
.
విలియం వర్డ్స్ వర్త్ 7 ఏప్రిల్ 1770 – 23 ఏప్రిల్ 1850 ఇంగ్లీషు కవి