నాకో చెల్లెలు పుట్టింది; ఆమెను మొదటముద్దాడినవారి పక్కన నేనున్నాను. నర్సు పొత్తిళ్ళలోపెట్టి తెచ్చి నాన్నకిచ్చినపుడు, ఆ చిన్నిపాపని చూసి నాన్నకళ్ళలో ఎంతవెలుగు కనిపించిందో! దానికి త్వరలోనే పేరుపెట్టాలి. నాన్న నాకు అవకాశం ఇచ్చారు మా చెల్లికి నన్నే పేరుపెట్టమని.
ఏ పేరు పెడితే తనకు నచ్చుతుంది చెప్మా! చార్లెట్, జూలియా, లేక లూయిజా? ఏన్, లెదా మేరీ? అవి అందరూ పెట్టుకునేవే. జోన్ అంటే, ఆడవాళ్ళకి మరీ సాంప్రదాయకంగా ఉంటుంది, పైగా జేన్ అంతకంటే బాగుంటుంది. కానీ జేన్ పేరుతో చనిపోయినవాళ్ళున్నారు. రెబెకా అంటే, అదొక తెగపేరు అని వాళ్ళు ఆక్షేపిస్తారేమో, ఎడిత్ అన్నది బాగానే ఉంది గాని, అదేదో పాత ఇంగ్లీషుపుస్తకాల్లో పేరు, ఎలెన్ ఎప్పుడో వాడుకలోంచిపోయింది బ్లాంచ్ అన్నది ఇప్పుడు నాజూకైన పేరుకాదు. నాకు ఇప్పటివరకు తట్టిన పేర్లలో మార్గరెట్ కి మించినదేదీ లేదు. ఎమిలీ చాలా నీటుగా బాగుంది పోనీ కెరోలీన్ అంటే ఎలా ఉంటుందంటావ్? అబ్బా ఇప్పుడు మరో ఎంచుకోవాలన్నా, ఆలోచించాలన్నా ఎంత చిక్కుగా ఉందో. నాకు భయం వేస్తోంది నేను పెట్టబోయే పేరు తనని అవమానం, అపఖ్యాతి పాలుచేస్తుందేమో నని పేరుపెట్టే పని నాన్నకే వదిలెద్దాం. . మేరీ లాంబ్