“అమ్మా! చంద్రుడు బూరుగుచెట్లుదాటి పోతున్నాడు
రోడ్డు ఎంతకీ తరగదు, తెల్లగా కనుచూపుమేరా,
మనం ఊరు ఇంతత్వరగా చేరలేమేమో,
చెప్పవూ, ఇంతకీ మనమెక్కడున్నామో?”
“నాన్నా, కన్నా, కాస్త ఓపికపట్టరా తండ్రీ,
మళ్ళీ మనకి త్రోవ కనిపిస్తుందిలే,
(భగవంతుడా! ఎవ్వరూ నడవని త్రోవ చూపించు
దేవుడా ! ఏమనిషికంటాపడకుండా రక్షణ కల్పించు!”)
“అమ్మా! నాకు నువ్వు చెప్పనే లేదు,
నన్నుతొందరగా ఎందుకు లాక్కొచ్చావో!
నేను సైనికులు పక్కనుండి వెళ్ళడం చూశాను
నాకు కాసేపు నిలబడితే బాగుణ్ణనిపించింది.”
“హుష్! గట్టిగా మాటాడకు! సైనికులు
పాడినట్టే, నేనూ పాడతాను నా చాతనైనంతవరకు…
వాళ్ళకి ప్రతివిషయానికీ ఒక పాట ఉంటుంది
వినరా, నా చిట్టితండ్రీ!
“ఇది సైనికులు కవాతుచేస్తూ పాడే పాట:
మనం ఈ వీధిలో పాడుకుండాము…”
“అలాగే, కానీ ఈ రోడ్డు చాలా పొడుగ్గా ఉంది
రాళ్ళు పొడుచుకొచ్చి నా కాళ్ళు పుళ్ళయిపోయాయి.”
“లేదురా, నా చిన్ని తెరువరీ, లే, పద
అదిగో వచ్చేసేము, ఆ కనిపిస్తున్నదే ఊరు.
నేను ముందుకీ వెనక్కీ సైనికులు
ఎలా కవాతు చేస్తారో చూపిస్తాను.”
“వాళ్ళు కవాతు చేస్తూ, పాడుతూ ముందుకిపోతారు
వాళ్ళకి దుమ్మూ, రాయీరప్పా గురించి చింతలేదు,
వాళ్లు వెళ్తుంటారు (దేవుడా! వాళ్ళనుండి నన్ను రక్షించు!)
ముందుకి, వాళ్ళు వెళ్ళకతప్పదు మరి.”
“అమ్మా! నాకు నిద్దరొస్తోంది.”
“లేదురా నాన్నా! ఇంద ఈ రొట్టెముక్క తిను.
హే భగవాన్! నన్ను కరువుతీరా ఏడవనీ!
లేదా, పగిలిపోయిన నా పాదాలని సరిచెయ్యి!”
.
గ్రేస్ హజార్డ్ కాంక్లింగ్