తుఫాను భయం… రాబర్ట్ ఫ్రాస్ట్, అమెరికను కవి
చీకటిలో గాలి మామీద కక్ష గట్టినట్టు వీస్తూ
తూర్పువైపు గది కిటికీని
మంచుతో బాదుతూ,
తన అరుపుల్ని నిగ్రహించుకుని
“ఒరే పిరికిపందా! రారా బయటికి”
అని గుసగుసలాడినట్టు అనిపిస్తుంది.
బయటికి వెళ్లకుండా ఉండడానికి పెద్దగా విచికిత్స అవసరం లేదు.
అబ్బే! లాభం లేదు.
నా బలాబలాలు బేరీజు వేసుకుంటాను
మేమిద్దరం, ఒక బిడ్డ.
మాలో నిద్ర రానివాళ్ళం దగ్గరగామునగదీసుకుని
ఒకపక్క పొయ్యిలో నిప్పు నెమ్మదిగా ఆరిపోతుంటే
మరోపక్క చలి ఎలా మెల్లిగా పాకురుతుంటుందో గమనిస్తుంటాం.
తుఫాను గాలి ఎలా తెరలు తెరలుగా వీస్తుంటే
ఏ ఆటంకాలూ లేని వీధితలుపుకీ రోడ్డుకీ మధ్య మంచుపేరుకుపోయి
దగ్గరగా ఉందని ధైర్యమిచ్చే ధాన్యంకొట్టంకూడా ఎక్కడో ఉందనిపిస్తుంది.
నా మనసులో ఒక సందేహం కలుగుతుంది:
“అసలు రేపు మేము ఉదయాన్నే లేచి
ఎవరిసాయమూ లేకుండా మమ్మల్ని మేము రక్షించుకోగలమా?” అని.
.
రాబర్ట్ ఫ్రాస్ట్
March 26, 1874 – January 29, 1963
అమెరికను కవి
