సంపెంగపువ్వు… రవీంద్రనాథ్ టాగూర్, భారతీయ కవి
సరదాకి, నేను సంపంగి పువ్వునై చిటారుకొమ్మన పూచేననుకుందాం. గాలి కితకితలకి నవ్వుతూ కొత్తగా చిగురించిన ఆకులమీద ఊగుతుంటే, అమ్మా, నీకు తెలుస్తుందా?
నువ్వు “అమ్మాయీ? ఎక్కడున్నావు?” అని పిలుస్తావు. నేను నాలోనేను నవ్వుకుంటూ మౌనంగా మాటాడకుండా ఊరుకుంటాను. నేను మెల్లగా రేకల కన్నులు విప్పి నువ్వు చేస్తున్న పనులన్నీ గమనిస్తుంటాను.
నువ్వు స్నానం చేసేక, తడిజుత్తు నీ భుజం మీద పరుచుకుని ఉంటే, సంపెంగచెట్టు నీడవెంబడే నువ్వు తులసికోటదగ్గరకి పూజచెయ్యడానికి వెళతావు. నీకు సంపెంగపువ్వు వాసన తెలుస్తుందిగాని నా దగ్గరనుండి వచ్చిందనిమాత్రం తెలీదు.
మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత నువ్వు కిటికీ పక్క రామాయణం చదవడానికి కూర్చున్నప్పుడు, చెట్టు నీడ నీ జుత్తు మీదా ఒడిలోనూ పడ్డప్పుడు, నేను నా చిన్ని నీడని నువ్వు చదువుతున్న పేజీ మీదకి సరిగ్గా నువ్వు చదువుతున్న చోటే పడేలా కదిలిస్తాను.
కానీ, నీకు అది నీ చిన్నారి కూతురు నీడే అని పోల్చుకోగలవా?
సాయంత్రం చీకటి పడ్డాక చేతిలో లాంతరు పట్టుకుని నువ్వు గోశాలలోకి వెళ్ళినపుడు, నేను అకస్మాత్తుగా మళ్ళీ భూమిమీదకి రాలి, మరోసారి నీ కూతుర్ని అయిపోయి నీ కాళ్ళు పెనవేసుకుని కథ చెప్పమని మారాం చేస్తాను.
“పెంకి పిల్లా? ఇంతసేపూ ఎక్కడికెళ్ళావు?” అని నువ్వు దెబ్బలాడతావు.
“నేను చెప్పనుగా,” అని నేనంటాను.
.
రవీంద్రనాథ్ టాగూరు
7 May 1861 – 7 August 1941
భారతీయ కవి
