నేను చంపిన సైనికుడు… థామస్ హార్డీ, ఇంగ్లీషు కవి
మేము గతంలో ఎప్పుడైనా
ఏ పాత సత్రం దగ్గరో కలిసి
ఉండి ఉంటే, పక్కపక్కన కూచుని
సరదాగా మద్యం సేవించి ఉండేవాళ్లమి.
కాని పదాతి దళంలో పెరిగి ఉండడం వల్ల
ఒకరికొకరు ఎదురై తేరిపార చూసుకుంటున్నప్పుడు
అతను నా మీదా నేనతని మీదా కాల్పులు జరుపుకున్నాం
అతను ఉన్నచోటే కూలబడి చనిపోయాడు.
అతన్ని నేను కాల్చి చంపేను
ఎందుకంటే, తను నా శత్రువు గనుక…
అంతే!— అతను నా శత్రువే అనుకొండి
అది స్పష్టం. సందేహమేమీ లేదు… కానీ…
నా లాగే, అతను కూడా, బహుశా
ఏ పంజరాలమ్ముకుంటూనో- పని పోయి- ఉన్నట్టుండి
సైన్యంలో చేరితేబాగుణ్ణనుకుని ఉంటాడు.
వేరే కారణం ఏదీ కనిపించదు.
నిజం. ఈ యుద్ధం ఎంత చిత్రాతిచిత్రమైనది కాకపోతే
మరొక చోట తారసపడి ఉంటే ఏదో సాయం చేయడమో
కడుపునింపి పంపించడమో చేసే సాటి మనిషిని,
ఇక్కడ నేలకూల్చవలసి వస్తుంది!
.
థామస్ హార్డీ
2 జూన్ 1840- 11 జనవరి 1928
ఇంగ్లీషు కవి, నవలా కారుడు
