మేము మరుగుపడ్డ చోట్లనుండి
ఒక రహస్యద్వారం గుండా
ఇక్కడ పచ్చగా విరిసినవైపుకి
వెన్నెల్లో బయటకి వస్తాము.
అక్కడ రాత్రంతా మేము
ఆటపాటల్లో మునిగిపోతాము
ఎంతగా గంతులేస్తామంటే
ఈ నేల ఎన్నడూ చూసి ఉండదు
ఆడుతూ గెంతుతూ
పదంలేని రాగాలు తీస్తుంటే
ఆ రాగం ఎంత కమ్మగా ఉంటుందంటే
పక్షులు కూడా చిన్నబోతాయి.
అక్కడ ఎందరో కన్నియలుంటారు
నశ్వరమైన శరీరం ధరించినవాళ్ళు
తమ లేత కన్నులనిండా
పుడమి గురించి ఆశలు నింపుకున్నవాళ్ళు
ఈ అడవి సొగసుకి ఉబికిన సంగీతం ఎంత విశృంఖలంగా
చెవులు కన్నాలు పడేలా ఉంటుందంటే
వసంత ఋతుకాంత చెవుల్లో తమ శక్తిమేరకి
అద్భుతంగా పాడే కోకిలలు సైతం మౌనం దాలుస్తాయి.
అందులో తన్మయులైన అనేకమంది యువత
కలలో నడిచినట్టు నెమ్మదిగా నడుస్తారు.
ఇంద్రజాలాన్ని పోలిన ఆ స్వర సమ్మేళనానికి
కాళ్ళు నేలమీద నిలవక నృత్యం చేస్తారు.
.
ఓహ్! ఒకటేమిటి, అవ్యక్తమధురంగా
ఆలపించే పక్షులూ పిట్టలూ నేల వాలి
అంత మధురంగా తాము పాడలేమే అని
మౌనంగా లోలోన చింతిస్తూ ఉంటాయి.
అలా రాత్రల్లా గడిచిపోతుంది
మేము వెర్రి ఆనందం పొందుతాం.
మేము ఈ నేల ఎన్నడూ ఎరగని
హద్దులులేని నృత్యాలు చేస్తాము.
.
స్యూమస్ ఓ సల్లివాన్