ప్రాచీన గ్రీకు ఇతిహాసం ప్రకారం కెసాండ్రా(అలెగ్జాండ్రా) ప్రయం, హెకూబాల కుమార్తె పేరు.
ఆమె భవిష్యత్తు ఎంత ఖచ్చితంగా చెప్పగలిగినా అవి ప్రజలు నమ్మకుండుదురుగాక అని అపోలో ఆమెను శపించాడని ప్రతీతి.
ఇది చాలా గొప్ప కవిత. దేశభక్తి అంటే జెండాలు ఎగరెయ్యడం, నినాదాలివ్వడం ఒక్కటే కాదు. మనం చేస్తున్న తప్పులు గ్రహించి సరిదిద్దుకుని, జనబాహుళ్యానికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ లాభించే పనులు చెయ్యాలి. మనబాగు కోసం పదిమందిని చంపుకుంటూ పోతుంటే, మనకి పాలించడానికి మిగిలేవి శ్మశానాలే అన్నసత్యం మరిచిపోకూడదు. ఈ కవి కొన్ని గొంతు మింగుడుపడని సత్యాలని చెప్పాడు… అమెరికను యుద్ధోన్మాదం గురించి.
అది మనకీ వర్తిస్తుంది. మనకున్న శతాబ్దాల వర్ణ, లింగ, వర్గ వివక్ష వారసత్వంగా సంక్రమిస్తోంది. పదిమందికి మంచిచెయ్యనిది మనకి మంచిచేస్తున్నదయినా నిర్దాక్షిణ్యంగా విడిచిపెట్టలేకపోతే, చరిత్రచూపిస్తున్న సత్యాన్ని చూడడం ఇష్టంలేక మనం కళ్ళు మూసుకున్నట్టు అవుతుంది తప్ప రాబోయే వినాశం మాత్రం తప్పదు.
.
ఎవరో అంటుంటే విన్నాను: “నిజానికి ఈ పిల్లలకి నేనేమి సలహా ఇవ్వగలను? మీకు డాలరు తప్ప మరోటి తెలియదు అదెక్క్డ పడిపోతుందోనని మీ భయం.
“దానికోసం ఎత్తైన పూజామందిరాలు కడతారు మిమ్మల్నందరూ చూడడానికి, కానీ మీరు గుడ్డివాళ్ళు దాన్నుండి ఎక్కువసేపు దృష్టిమరల్చ లేరు మీ ముందూ వెనకా ఏమున్నాయో చూడడానికి.
“మీ విచక్షణ కాసేపు ఆగమని ప్రబోధించినా ఓ నవ్వు నవ్వి, మీకే ఎక్కువ తెలుసునంటారు; కాని మీకు తెలిసినదాన్ని గుండెల్లో లోహపు కడ్డీల్లా భద్రంగా దాచుకుంటారు.
మీరు నవ్వుతూ అంటారు: “మేమింకా కుర్రాళ్ళం, విడిచిపెట్టి, మా మానాన్న మమ్మల్ని ఎదగనీండి: అని కాలం మిమ్మల్ని ఎంత భరించాలి, విధి ఇంకా మీకెంత అనుగ్రహించాలి అన్న దానికి సమాధానం లేకుండా.
“అదృష్టవశాత్తూ కొన్ని సంతోషకరమైన సంవత్సరాలు కలిసొచ్చాయి; కానీ ఆ గర్వమే మీ పతనానికి దారి తీస్తోంది. కాలం మీకు ఆ అదృష్టం అలాగే కొనసాగుతుందనీ మీకు పరీక్షపెట్టకుండా ముద్దు చేస్తుందనీ అనుకుంటున్నారా?
నశించిన ఏ చరిత్ర గ్రహణం, నిలకడలేని ఏ నక్షత్రాల గుడారాలు మీకు సహస్రాబ్దాల ముందుచూపునిచ్చి యుద్ధాలని కొనసాగనిమ్మంటున్నాయి?
ప్రపంచం ఇంతవరకు ఎరుగని చరిత్రకెక్కని ఏ పదవీ చ్యుతి ఎక్కడ జరిగిందనుకున్నా, మీకొక్కరికేనా, అంత తేటతెల్లంగా సంకేతాలిచ్చింది?
“మీ డాలరూ, మీ పావురం, మీ రాబందూ అవొక మూర్తి త్రయం. వాటిని మీరు మీకంటే కూడా గొప్పగా ఊహించుకుంటారు అది లాబిస్తుంది, ఉబ్బిస్తుంది, కొత్తగా ఉంటుంది.
“శక్తి మీది, మీ చూపుది కాదు. మీరు దేనిమీదనడుస్తున్నారో చూడలేకున్నారు; మీకు శతాబ్దాల విజ్ఞానం మార్గం చూపిస్తోంది కానీ దాన్ని అనుసరించే తెలివే మీకు లేకున్నది.
క్రూరమూ, నిర్దాక్షిణ్యమైన పాత సత్యాలనే ఎప్పటికీ అనుసరించాలని అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రపంచం ఏమిటో అంచనావెయ్యడానికి కళ్ళు తెరిచి చూడవలసిన అవసరం లేదా?