అనువాదలహరి

శ్వేతతుషారం… చక్రవర్తి సలహాదారు యకమోచి, జపనీస్ కవి

కొండగాటి పక్షుల వంతెన మీద
మిరిమిట్లుకొలిపే ధవళవస్త్రాన్ని
పగటిఱేడు శ్వేతతుషారంతో పరచగానే
అర్థమయింది నాకు: రాత్రి అట్టేలేదనీ
వెలుతురు ఇక చిక్కగా చొచ్చుకొస్తుందనీ.

.

ఈ కవిత కృతికర్త Koshu ప్రాంతపు గవర్నరు, అప్పటి జపానులోని అంతగా నాగరికత చాయలు కనరాని ఉత్తర తూర్పు ప్రాంతాలకు వైస్రాయి గా ఉండే యకమోచి. అతను సుమారు క్రీస్తు శకం 785 ప్రాంతాలవాడు. క్యోటోలోని రాజ సౌధంలో “Magpies Bridge” అనే వంతెన మార్గం ఉంది. కానీ ఈ కవితలో ఆ పదం రాజసౌధంలోని వంతెనను గాక, జపానులో ప్రచారంలో ఉన్న ఒక జానపదకి సంకేతం. అభిజిత్తు నక్షత్రం ఒక సాలె కన్నియ. ఆమె పాలపుంతకి (ఒక నదిగా భావించబడింది) ఈవల ఉండేదట. ఆమె దేవతలకి వస్త్రాల్ని నేసేదట. సూర్యదేంవుడికి ఆమె మీద కరుణ కలిగి పాలపుంతకి ఆవలివైపునున్న Aquila (గరుడుడు) అన్న గొల్లవానితో పెళ్ళి చేశాడు. దాని పర్యవసానంగా దేవతలకి వస్త్రాలు కరువయిపోయాయి. దానితో వాళ్ళు ఆమె తన భర్తని కలుసుకుందికి ఆంక్షలు పెట్టారు. ప్రతి ఏడూ 7వ నెలలో 7 వరోజు రాత్రి కలుసుకోవాలని. ఆ రోజు రాత్రి పాలపుంత మీద కొండగాటి పక్షుల (Magpies) సమూహం ఒక వంతెనలా నిలబడితే వాటిమీంచి ఆమె భర్త ఆమెదగ్గరకి చేరేవాడట. ఈ శ్వేతతుహినం (Hoarfrost) సరిగ్గా పొద్దుపొడిచే ముందు ఏర్పడుతుందట. కథని పక్కనబెడితే, ఖగోళమూ, ప్రాంతీయవాతావరణమూ మనిషిజీవితంతో, ఆలోచనలతో, అనుభూతులతో, కల్పనాశక్తితో ఎంతగా పెనవేసుకుపోయాయో మనకి తెలుస్తుంది.

.

 

When on the Magpies’ Bridge I see
The Hoar-frost King has cast
His sparkling mantle, well I know
The night is nearly past,
Daylight approaches fast.

.

The Imperial Adviser YAKAMOCHI

Japanese Poet

Around CE 785

.

(ఆంగ్లమూలం: THE HYAKU-NIN-ISSHIU కి William N Porter అనువాదం
Courtesy: Internet Archives)

 

%d bloggers like this: