భగవత్ స్వరూపము… విలియం బ్లేక్, ఇంగ్లీషు కవి
క్లేశములో ఉన్నవాళ్ళు ఎప్పుడూ కోరేది
కరుణ, జాలి, ప్రశాంతత, ప్రేమ;
ఆనందాన్నిచ్చే ఈ సుగుణాలకి
వాళ్ళు పదేపదే కృతజ్ఞతలు తెలుపుకుంటారు.
కరుణ, జాలి, ప్రశాంతత, ప్రేమ
మన తండ్రియైన భగవంతుని రూపాలు;
కరుణ, జాలి, ప్రశాంతత, ప్రేమ
తన కుమారుడు మనిషికి రక్షలు.
కరుణకి మానవ హృదయం ఉంది
జాలిది మనిషి ముఖం
ప్రేమ మనిషిరూపంలోని అపర దైవం
ప్రశాంతతది మానవ ఆహార్యం.
కనుక ప్రతి మనిషి, ఏ దేశవాసియైనా
తను కష్టాల్లో ఉండి ప్రార్థించినపుడు
మానవరూపంలోని దైవాన్నే వేడుకుంటాడు
కరుణ, జాలి, ప్రశాంతత, ప్రేమ కోసం.
అందరూ ఈ మానవ మూర్తిని ఆరాధించవలసిందే
అనాగరికుడైనా, తురుష్కుడైనా,యూదుడైనా;
ఎక్కడ కరుణ, జాలి, ప్రశాంతత, ప్రేమ
వసిస్తాయో, అక్కడ దేవుడు వసిస్తాడు.
.
విలియం బ్లేక్
28 November 1757 – 12 August 1827
ఇంగ్లీషు కవి
William_Blake by_Thomas_Phillips Image Courtesy: Wikipedia