ఓ నా దేశవాసులారా!… కవి ప్రదీప్, హిందీ, భారతీయకవి
మిత్రులందరికీ 69వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
1963 వ సంవత్సరం గణతంత్రదినోత్సవం సందర్భంగా లతా మంగేష్కర్ ప్రముఖ హిందీ కవి ప్రదీప్ వ్రాసిన ఈ గీతాన్ని, అప్పటి ప్రధానమంత్రి శ్రీ నెహ్రూ సమక్షంలో జనవరి 27న National Stadium లో ఆలపించేరు. ఆ గీతాన్ని ఇక్కడ వినండి
ఓ నా దేశవాసులారా! మీ కనుల్లో నీరు నింపండి
మీ నోరారా నినాదాలు ఇవ్వండి
ఈ రోజు మనందరికీ శుభదినం
మువ్వన్నెల జండా ఎగరెయ్యండి
కానీ, మనం అమరవీరులని మరిచిపోవద్దు
వాళ్లు సరిహద్దుల్లో దేశంకోసం త్యాగం చేశారు
పాపం ఇంటికి తిరిగిపోలేకపోయారు
వాళ్ళని ఒకసారి స్మరించ్కుకొండి.
.
ఓ నా దేశవాసులారా! మీ కనుల్లో నీరు నిండనీండి
దేశంకోసం ప్రాణాలిచ్చిన వీరుల్నీ, వారి త్యాగాల్నీ తలుచుకొండి
మీరు మరిచిపోకుండా నన్ను ఈగీతాన్ని ఆలపించనీండి
దేశంకోసం ప్రాణాలిచ్చిన వీరుల్నీ,వారి త్యాగాల్నీ స్మరించుకొండి
.
హిమాలయాల్లో దాడి జరిగినపుడు,
మన స్వాతంత్ర్యానికి ప్రమాదం వచ్చినపుడు
వాళ్లప్రాణం పోయే వరకూ
వాళ్ళు పోరాడుతూనే ఉన్నారు
తుపాకులమీద ముఖం వాల్చి
వీరులు శాశ్వతనిద్రపోయారు
వాళ్ళనీ, వాళ్ళ త్యాగాన్నీ ఒకసారి మననం చేసుకొండి.
.
దేశం దీపావళి జరుపుకుంటుంటే,
వాళ్ళు తమరక్తంతో హోళీ ఆడుతున్నారు
మనం ఇళ్లలో గుమ్ముగా ఉంటే,
వాళ్ళు రణరంగంలో తూటాలు ఎదుర్కొంటున్నారు
ధన్యజీవులు ఆ యువకులు
ధన్యమయింది వారి యవ్వనం
ఆ త్యాగధనుల్నీ, వారి త్యాగాన్నీ ఒకసారి గుర్తుంచుకొండి
.
అతను సిక్కుగాని, జాట్ గాని, మరాఠా గాని
అతను గుర్ఖానో మదరాసీనో కావొచ్చు
కానీ, యుద్ధభూమిలో మరణించిన ప్రతివీరుడూ
ఈ భారతదేశపు పౌరుడే
హిమాలయాల్లో చిందిన ప్రతి రక్తపుబొట్టూ
అది భారతదేశపు రక్తమే
ఆ వీరుల్నీ, వారి త్యాగాన్నీ గుర్తుంచుకొండి
.
వాళ్ల శరీరం రక్తం ఓడుతోంది
అయినా వాళ్ళు తుపాకులు వదలలేదు
వాళ్ళు ఒక్కొక్కరూ పదిమందిని చంపి
శరీరంపై స్పృహకోల్పోయేరు
మరణసమయం ఆసన్నమవడంతో
వాళ్ళిలా అంటున్నారు: దేశవాసులారా, సుఖంగా వర్థిల్లండి .
ఇక శలవు ఇప్పించండి,మేము చాలాదూరం వెళ్ళాలి
ఆ వీరులెంత గొప్పవాళ్ళు!
వాళ్ల జీవితాలెంతగొప్పవి!
ఆ త్యాగధనుల్నీ, వాళ్ళ త్యాగాన్నీ గుర్తుంచుకొండి.
.
కవి ప్రదీప్
(రామచంద్ర నారాయణ్ ద్వివేది)
హిందీ,
భారతీయకవి