ఎలిస్ పార్క్ … హెలెన్ హోయెట్, అమెరికను కవయిత్రి
ఓ నా చిన్ని ఉద్యానమా!
నేను నీలోంచి వెళ్ళిన ప్రతిసారీ
నీ నుండి ఒక భాగాన్ని తీసుకుపోతుంటాను.
ప్రతిరోజూ పట్టణంలో ఉద్యోగానికి
నీపక్కనుండి తొదరతొందరగా వెళ్తు వెళ్తూ
నగర మార్గాన్ని సమతూకం చెయ్యడానికి
నిన్నక్కడికి తీసుకుపోతాను.
నీ చెట్లనీ
నీ చల్లగాలినీ
నీ పచ్చదనాన్నీ
నీ స్వచ్ఛతనీ,
నీలోని కొంత నీడనీ, కొంత ఆకాశాన్నీ
నిలోని కొంత ప్రశాంతతనీ నాతో తీసుకుపోతాను.
దారుణంగా కనిపించే ఆ త్రోవల్ని
శుభ్రపరచడానికి నీ పువ్వుల్నీ,
ఇరుకుగా ఉండే వీధులకి కొంత నీ ఖాళీస్థలాన్నీ,
నా పాదాలకింద మెత్తగా ఉండడానికి నీ పచ్చికనీ,
నా ఆఫీసు గదిగోడలమీద మనోహరంగా కనిపించడానికి
చిమ్మనగోవుల్నీ, వినిపించడానికి పిట్టల్నీ తీసుకుపోతాను
అంతెందుకు, నాకు కనిపించినవన్నీ
నాతో ఎత్తుకుపొతాను
అయినా నీ దగ్గిర తరగనంత సంపద ఉంది
నే నెంత పట్టుకుపోయినా పెద్దతేడా పడదు.
నువ్వు నేను ఉదయం వెళ్తున్నప్పుడు ఎంత తాజాగా ఉంటావో
నేను ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా అంత తాజాగా ఉంటావు
నీ సౌందర్యంలో ఏమీ మార్పు ఉండదు
నీ సిరులన్నీ ఎప్పటిలా నియమితస్థానాల్లో ఉంటాయి.
మళ్ళీ నేను మర్నాడు
తీసుకుపోడానికి అనువుగా.
అవునూ, ఎలియక అడుగుతాను, నా చిన్ని ఉద్యానమా!
నే పోతూపోతూ పాడే ఈ స్తుతిగీతం వినిపిస్తుందా?
.
హెలెన్ హోయెట్
అమెరికను కవయిత్రి
Image Courtesy:
.