(మొదటి ప్రపంచ సంగ్రామంతో ప్రపంచంలో నిరాశా నిస్పృహలు కమ్ముకున్న వాతావరణంలో, ఆంగ్లసాహిత్యంలో ఇమేజిజం అన్న ఒక సాహిత్యోద్యమాన్ని, లేవనెత్తినవాళ్ళలో ప్రథముడు… రిఛర్డ్ ఆల్డింగ్టన్.
ప్రతీకలద్వారా కళ్ళెదుట ఉన్నవస్తువుని పాఠకుడికళ్ళముందు రూపుకట్టేటట్టు ప్రయత్నించడం వీళ్ళ ఆదర్శమైనా, ఈ ఉద్యమంలోని కవులు సందర్భానికి పనికిరాని ప్రతీకలూ, అవసరానికి మించి, ఒక్క మాట అయినా ఎక్కువ వాడకూడదన్న నియమం కలిగిన వారు; కవి ఉన్నదున్నట్టు చెప్పినా విషయాన్ని మాత్రం వాచ్యం చెయ్యడు.
ఈ కవితలో ఎత్తుగడ Romanticism బాటలో ప్రకృతితో ప్రారంభించినా, ముగింపులో, చెప్పిన తెల్లదనం, పువ్వులూ, రాళ్ళూ, మృత్యువుకీ, సమాధులకీ ప్రతీకలు. ఇంత అందమైన ప్రకృతీ అనుకోకుండా కమ్ముకున్న ప్రపంచ యుద్ధమేఘాల తాకిడికి నిర్జీవమై మానవాళికంతటికీ ఒక పెద్ద శ్మశానమై మిగిలిపోతుందికదా అన్న భావన ఆపుకున్న ఏడుపుకి కారణంగా కవి చిత్రిస్తాడు.)
.
నేను ఈ తోటలో హాయిగా కూచున్నాను
నిలకడగా ఉన్న చెరువునీ, రెల్లుగడ్డినీ…
వేసవి చివరలో పొదరిళ్ళలోని
పలువర్ణాల ఆకులుని చెదరగొట్టినట్టుగా
ఆకాశంలో అలముకున్న నల్లని మేఘాలని
చెదరగొడుతున్న సుడిగాలినీ చూస్తూ;
కానీ, ఇవీ, వీటితోబాటు చెరువులోని కలువలూ
ఎంత ఆనందాన్ని కలుగజేసినా,
నాకు ఏడుపు తెప్పించినంత పని చేసినవి
గులాబులూ… మనుషులు నడుచుకుంటూ పోయే
తెల్లని నాపరాయి పలకలూ,
వాటి మధ్య రంగు వెలిసిన పచ్చగడ్డి మొక్కలూను.
.
రిఛర్డ్ ఆల్డింగ్టన్
ఇంగ్లీషు కవి.
.
.
స్పందించండి