తప్పించుకోలేని ఈ ఐహిక బాధలనుండీ
ఈ జీవితం నుండీ నేను నిష్క్రమించినపుడు
నా కోసం నల్లని దుస్తులు ధరించవద్దు
ప్రియతమా! నువ్వు ఉంగరాన్ని మాత్రం తియ్యకు.
దయచేసి ఆ తళతళల వజ్రాన్ని
నా గుర్తుగా చేతికి ఉంచుకో
అది నీ కళ్ళలో మెరిసినప్పుడు
అది పక్కనుండి నడుస్తున్న నా నీడగా భావించు.
ఎందుకంటే, ఆ వజ్రం కన్నా, ఆ మాటకొస్తే
ఏ రత్నం కన్నాకూడా ప్రకాశవంతంగా నీకు కనిపిస్తాను.
అక్కడ ఏదో జరగకూడనిది జరిగినట్టు
ఇంటిని నల్లని అలంకరణలతో నింపకు.
నా సమయం సమీపించి నేను పోయినపుడు
నీకు దుఃఖించవలసిన పని లేదు
నా స్మృతికి చిహ్నంగా, గుర్తుగా
నా వస్తువు దేనినీ భావించవద్దు.
నేను నా అదృష్టం కొద్దీ శాశ్వతుడైన
భగవంతుని స్వర్గధామం నుండి వచ్చేను
నేను అతని నివాసానికి వారసు రాలిని,
అది అతని వాగ్దానం, దేముడు మాట తప్పడు.
నన్ను నా సోదరుడి సమాధిపక్కనే నిద్రపుచ్చండి
అలా చేస్తానని మీరు మాట ఇచ్చేరు.
ఇక నేను శలవు తీసుకోవలసిన సమయం వచ్చింది
మీ నుండి నేను వీడ్కోలు తీసుకోక తప్పదు.
.
అజ్ఞాత కవయిత్రి
స్పందించండి