ఉదయం… సముద్రపొడ్డున… ఫ్రాన్సిస్ ఏన్ కెంబుల్, ఇంగ్లీషు కవయిత్రి
(ఈ కవితలో సూర్యుడు, గుర్రాలు అన్న అంశం గమనించండి. ఆమెకు భారతీయ ఇతిహాస విషయాలు కొంతవరకైనా తెలుసునని అనిపిస్తుంది. ఈ కవిత కళ్ళకు కట్టినట్టు చిత్రించిన అపురూపమైన భావ చిత్రం.)
నీ కళ్ళమీద ఈ రెండు ముద్దులతో
వాటి మీద పేరుకున్న నిద్రని కరిగిస్తాను. లే !
ప్రియతమా, చూడు అప్పుడే సూర్యుడు తన బంగారు హస్తాన్ని
తెల్లని ఆ సముద్రపు మేనిపై జాచి నిమురుతూ
నవనవోన్మేషమైన తరగలమీంచి అద్భుతంగా పైకి లేస్తూ,
విశాలంగా పరుచుకున్న సైకత తలాన్ని పరికిస్తున్నాడు.
అదిగో అతని అశ్వాలు నిశ్వాసాలలో నిప్పులుమిస్తూ లేస్తున్నాయి
విజయ గీతాన్ని ఆలపిస్తూ మహత్తరమైన
ప్రాభాత ఘడియలు అతని చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాయి.
ప్రకాశమానమైన దినప్రభ అప్పుడే ప్రారంభమయింది.
రా, నీ చేతిని నా చేతిలో బంధించి
ఈ మెరుస్తున్న ఇసుకమీద తొందరగా నడుద్దాం.
చూడు, ఉవ్వెత్తుగా ఎగసిన అలలు
వంపులు తిరిగి పారదర్శకమైన గుహల్ని సృష్టిస్తున్నాయో
లేస్తూ వంపులు తిరుగుతూ
దొర్లుతూ, వెనక్కి వస్తూ
ధ్వనిస్తూ, ప్రతిధ్వనిస్తూ,
పాల మీగడలాంటి నురుగుల వంపుల్లోకి ప్రవహిస్తున్నాయి.
గమనించు. దూరంగా తెల్లటి గీతలతో సముద్రం చీల్చినట్టుంది.
ఒడ్డున విశ్రమిస్తున్న చిన్న ఓడ ఒకటి
దాని తెడ్ల రెక్కలు ముడుచుకుని నిదరోతోంది.
చిరుగాలి విసురుకి దాని రెక్కలొక్కసారి విదుల్చుకుంది.
పిచ్చుకలా నీటిలోపలకి ఒకసారి మునిగి తలవిదుల్చుకుంటోంది.
స్వాగతం, అహస్సుకి! స్వాగతం, వింత కాంతికి.
స్వాగతం, చీకటినుండి అద్భుతమైన మేల్కొలుపుకి.
స్వాగతం, స్తవనీయమైన ధరిత్రికి.
స్వాగతం, స్వచ్ఛమైన ఉదయ పవన చుంబనాలకి.
స్వాగతం, ప్రియతమా! నా ప్రాణమా! నా శ్వాస, నా వెలుగు,
నా పగలు, నా మాపు, నా రేయి,నా జీవితాత్మా!
.
ఫ్రాన్సిస్ ఏన్ కెంబుల్
27 November 1809 – 15 January 1893
ఇంగ్లీషు కవయిత్రి
.
.