కానీ కాలం మందల్ని పొలం నుండి పొలానికి తరుముతుంటుంది,
నదులు వరదలై పొంగుతాయి, రాళ్ళు చల్లబడతాయి;
కోయిలకూడా మూగబోతుంది; మిగతావాళ్ళు
జీవితం ఎలా వెళ్లదీయాలా అన్న చింతలో ఉంటారు.
పువ్వులు వాడిపోతాయి; విధేయతలేని పొలాలు
నిలకడలేని హేమంతానికి తలఒగ్గుతాయి;
పెదాలపై తేనె, మనసులో విషం,
ఊహకి వసంతమే గాని, దుఃఖానికి దారితీస్తాయి.
నీ తుపాకులు, నీ జోళ్ళు, నీ పూలపాంపులూ
నీ టోపీ, నీ ఉడుపులూ, నీ సింగారాలూ
త్వరలోనే క్షీణించి, నశించి మరుగైపోతాయి.
వెర్రి ముదిరినపుడు, తెలివి మందగిస్తుంది.
నీ తృణమేఖలలూ, అందులో అందమైన మొగ్గలూ,
నీ పగడాల వస్త్రాలూ, పసుపువన్నె బొత్తాములూ
ఇవేవీ ఏ కోశానా నా మనసును చూరగొని
నీదాన్ని చేసి, నీ భార్యగా చెయ్యలేవు.
యవ్వనం శాశ్వతమై, ప్రేమ నిరంతరం చిగుర్చగలుగుతే
ఆనందానికి కాలనియమాలు లేక, వయసు అవుసరం లేకపోయి ఉంటే
బహుశా ఈ ఆనందాలు నన్ను మైమరపించి
నీ భార్యనై, నీతో జీవించేట్టు చేసి ఉండేవి.
.
సర్ వాల్టర్ రాలీ
1554 – 29 October 1618
ఇంగ్లీషు కవి
.
ఎలిజబెత్ మహారాణి ఈ హయాం లో ఒక వెలుగు వెలిగిన వ్యక్తి సర్ వాల్టర్ రాలీ. ఆమెకి ప్రీతిపాత్రుడుగా, యుధ్ధతంత్ర నిపుణుడిగా, నావికుడిగా, అన్వేషకుడిగా, గూఢచారిగా, కవిగా అనేక పాత్రలు నిర్వహించి ఆమెవల్ల అనేకలాభాలు పొందిన వ్యక్తి. El Dorado కల్పితపట్టణానికి కారణం అతని సాహసయాత్రలను అతిశయోక్తులతో కూర్చి చెప్పిన కథనమే. అతను బ్రిటిషు గయానా, వెనిజులా తూర్పు ప్రాంతాలను కూడ బంగారంకోసం అన్వేషించాడు. ఎలిజబెత్ మహారాణి మరణం తర్వాత జేమ్స్ I మహరాజుపై కుట్రపన్నేడన్న అభియోగంతో 1618 లో అతను శిరచ్ఛేదానికి గురి అయ్యాడు.