వాళ్ళు నిద్రించే చోట… జీ. ఓ. వారెన్, అమెరికను కవి
నల్లగా నిశ్చలంగా చుట్టబెట్టుకున్న పొగమంచు
పోటెత్తిన సముద్రం ఒడ్డు ఇసుకను ముంచెత్తినట్టు
దట్టమైన సమాధుల్లో లోతుగా వ్యాపించి
వాళ్ల శిరసులపై నక్షత్రధూళి నింపుతోంది.
వాళ్ళు నిద్రిస్తూ చాలా కాలమయింది.
వాళ్ళ తనుమృత్తికి ఏదో తెలియని బూజుపట్టింది.
వాళ్ళ గురించి చెప్పగలిగిందేమైనా ఇంకా ఉంటే,
కొద్దికొద్దిగా శిధిలమౌతున్న ఆ రాళ్లు చెప్పగలవు.
దారి తప్పి ప్రయాణిస్తున్న ఒంటరి నావికుడిలా
మేరలేని ఎటో తేలుతున్న పొగమంచులో
ఈ మునుగుతున్న సమాధులపై వాలి చూస్తూ
నేనూ ఇక్కడకు చేరవలసిందేగదా అని యోచిస్తున్నాను.
అక్కడ నిత్యమూ నిశీధి తరగలూ, ఈ నేలా
నా ఏకాంత విశ్రాంతి మందిరాన్ని మరుగుపరుచును గాక!
ఆ సమాధి ఫలకంపై ఉన్న మాటల్ని
నా ప్రేమిక మరిచిపోయేలా కాలం అనుగ్రహించుగాక.
.
జీ. ఓ. వారెన్
అమెరికను కవి