II… లావొ జూ సంకలనం (చీనీ) నుండి
ప్రపంచానికి అందాన్ని అందంగానే తెలుసు
అందుకే అక్కడ కురూపితనం కూడా ఉంది.
ప్రపంచానికి మంచిని మంచిగానే తెలుసు
అందుకే అక్కడ చెడు కూడా ఉంది.
అస్తిత్వమూ, శూన్యమూ ఒకదాన్నొకటి సృష్టించుకుంటాయి
కష్టమూ, సుళువూ ఒకదాన్నొకటి నిర్వచించుకుంటాయి,
పొడవూ, పొట్టీ ఒకదానికొకటి హద్దులేర్పరచుకుంటాయి,
ఎత్తూ, పల్లమూ ఒకదానిమీద ఒకటి ఆధారపడతాయి.
గళమూ, స్వరమూ ఒకదాన్నొకటి శృతిలో ఉంచుకుంటాయి,
పాతదీ, కొత్తదీ ఒకదాన్నొకటి అనుసరిస్తాయి,
విజ్ఞులు కర్మకి అకర్మ ద్వారా కట్టుబడి ఉంటారు,
మౌనంద్వారా చెప్పదలచుకున్నది వ్యక్తపరుస్తారు.
ఒక రీతిలో కొన్ని వేల జీవులు సృష్టించబడతాయి
అంతమాత్రం చేత దానిమీద అధికారం ముద్రించబడదు
ఏ ఆధిపత్యం లేకుండా జీవితం ప్రసాదిస్తుంది.
వాటికి ఉపకారం చేసినా కృతజ్ఞత ఆశించదు.
దాని పని అదిచేసుకుపోతూ, ఏ యోగ్యతా ప్రకటించదు.
అది యోగ్యత ప్రకటించనంత మాత్రం చేత
అందులో యోగ్యత లేదని అర్థం కాదు.
.
లావొ జూ
Tao te Ching సంకలనం (చీనీ) నుండి
