నేను నిన్ను కలుసుకున్న మొట్ట మొదటి రోజు,
మొదటి గంట, మొదటి క్షణం గుర్తు తెచ్చుకోగలిగితే బాగుణ్ణు,
అది వసంతమో, హేమంతమో,
వేసవో, శిశిరమో ఏమీ చెప్పలేను;
జ్ఞాపకం ఏ మాత్రం నమోదవకుండా ఆ క్షణం జారుకుంది,
చూపూ, ముందుచూపూ లేని గుడ్డిదాన్ని,
చిగురిస్తున్న నా తనులతని పోల్చుకోలేనిదాన్ని …
అప్పటికి ఎన్నో వసంతాలు పూత ఎరుగని దాన్ని.
దాన్నే గనుక గుర్తుతెచ్చుకోగలిగితేనా!
ఎటువంటి రోజది! నిరుడు కురిసిన హిమసమూహంలా
దాని జాడలేకుండా కరిగిపోనిచ్చాను;
నా కప్పుడు అది ఎమీ కానట్టనిపించింది, ఎంత విలువైనది;
ఆ స్పర్శ నేను గుర్తు తెచ్చుకోగలిగితేనా,
చేతిలో మొదటిసారి మరోచేయి తొలిస్పర్శ… ఎవరికైనా గుర్తుంటుందా!
.
క్రిస్టినా రోజేటి
5 Dec 1830 – 29 Dec 1894
ఇంగ్లీషు కవయిత్రి.