మీ అయ్యేడే? మీ అయ్యేడే పొట్టిదానా? అని అందరడుగుతుండ్రే. గయ్యాల సిమ్మసీకట్ల పోలీసోల్లు అమ్మజుట్టుపట్టి నీ మొగుడెప్పుడొస్తుండే లంజదానా? అని తిట్టి తిట్టి పోయిండ్రు.
తమ్ముడేడ్చినప్పుడల్లా
‘అయ్యగుర్తొచ్చినాడ్రా’ అని ఏడుస్తదే అమ్మ. ఆ గుంజకానుకుని ఏడ్చుకుంటనే తమ్మునికి పాలిస్తది. అయ్యా! అప్పుడు నువ్వొస్తే బాగుండనిపిస్తదే!
నువ్వొచ్చేటప్పుడు అయ్యా ఇస్కూలు కానుంచి రావొద్దు పోలీసొల్లు ఆడనే పత్తాలాడుకుంట కూసుంటరు నీ సంచిల పిస్తోలుంటది గద! మరి నువ్వెందుకు భయపడుకుంటొస్తవే?
అడవిలేంచేస్తవే అయ్యా నువ్వు పులులు ఎలగొడ్లు-భయం గాద్? అన్నమెవలు పెడ్తరే నీకు మీ అమ్మున్నాది!
సీకటి కాంగనే అమ్మ పండుకొమ్మంటది
నాకేమో నీకోసం కూసోవాలన్పిస్తది అమ్మకు జర బువ్వ తినమని సెప్పు నువు పోయిన కానించి తింటే తింటది పంటె పంటది నీ కోసం మాత్రం ఉట్టి మీది బువ్వ ఊగుతనే వుంటది
మొన్నొచ్చినపుడు నీ కాలుకు ఒకటే దెబ్బ ఉండెగద! ఇంకో దెబ్బెట్ల తగిలిందే! అయ్యా! నువ్వీ దెబ్బలతోటెట్ల పోతవే! ఇంట్లోనే ఉంటే ఏమైతది? నేనెవ్వరికీ చెప్ప! నీమీద కాలేసి పండుకోవాలన్పిస్తుందే అయ్య! నీ పుండు మీద మందు పెట్టాలన్పిస్తుంది అయ్య! వుండవా! అయ్యా! నువు రోజొస్తె ఏమైతదే! అందరు పండుకున్నంక సీకట్ల సీకట్ల దిడ్డికాడంగ రారాదె! గొళ్ళెం తీసి పెడ్త! నిద్రపోను ఒట్టు! నీ కోసం అట్లనే కూసుంట. నీ చెవిలో ఒకటడుగుత-తే! ‘అయ్య! మల్లెప్పుడొస్తవే!’