అనువాదలహరి

అటువంటి దేశాన్ని చూసి జాలిపడు… ఖలీల్ జిబ్రాన్, లెబనీస్ అమెరికన్ కవి

(మహాకవులు ఎప్పుడూ దార్శనికులే.

వాళ్ళ కృతులు పరిమితం కావచ్చునేమో గాని వాళ్ళ పలుకుల విస్తృతి అపరిమితం.

అవి దేశకాల అవధుల్ని అవలీలగా జయించి వాటిలోని సత్యాన్ని ఆవిష్కరిస్తూనే ఉంటాయి.

ఈ కవితలోని ప్రతి పాదములో చెప్పిన భావానికీ (లేదా వేదనకీ), నేడు మనదేశ వ్యవస్థలో పొల్లుపోకుండా ఉదాహరణలు కనిపిస్తాయి. 

అంతకంటే గొప్పనిదర్శనం ఏమిటి కావాలి?)

ఏ దేశ ప్రజలకి అఖండమైన విశ్వాసాలుండి, ఆచరణలో అవి మృగ్యమో;

ఏ దేశం అక్కడ నేయని బట్టని తొడుక్కుని,

అక్కడపండని పంటని తిని,

అక్కడ తయారు కాబడని సారాయి తాగుతుందో;

ఏ దేశంలో గూండాలని నాయకులుగా కీర్తించి,

దోచుకున్న వాడిని దాతగా సమ్మానిస్తారో;

ఏ దేశంలో ప్రజలు తాము కలలో కూడా అసహ్యించుకునే బలహీనతకి

మెలకువగా ఉన్నప్పుడు వెంపర్లాడతారో;

ఏ దేశంలో ప్రజలు శవయాత్రలో పాల్గొన్నప్పుడు తప్ప

మరెన్నడూ  నోరు మెదపరో;

శిధిలాలలో తప్ప గర్వంగా చెప్పుకుందికి ఏమీ ఉండదో;

వధ్యశిలకీ, కత్తికీ నడుమ తల ఉంచేదాకా

ఏ దేశ ప్రజలు దేనికీ ఎదిరించి పోరాడరో;

ఏ దేశనాయకుడు జిత్తులమారి అయి,

అక్కడి జ్ఞానులు గారడీవాని స్థితికి దిగజారి

అనుకరణలూ, తాత్కాలికచర్యలూ తప్ప మరేమీ చెయ్యలేరో;

ఏ దేశంలో కొత్త నాయకుడిని మంగళ వాయిద్యాలతో ఆహ్వానించి

పాతనాయకుడిని ఛీత్కారాలతో సాగనంపి

మళ్ళీ అతన్నే మరోసారి మంగళవాయిద్యాలతో స్వాగతిస్తారో;

ఏ దేశపు మేధావులు వయసుతోపాటు నిర్వీర్యులై,

ఆ దేశపు సాహసవంతులంతా ఇంకా ఉయ్యాలలోనే ఉంటారో;

ఏ దేశం చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి

ప్రతి చిన్నముక్కా తననోదేశంగా భావించుకుంటుందో;

అటువంటి దేశాన్ని చూసి జాలిపడు. 

.

ఖలీల్ జిబ్రాన్

6 జనవరి 1883-  10 ఏప్రిల్  1931

లెబనీస్ అమెరికను కవి

.

.

Pity The Nation

.

Pity the nation that is full of beliefs and empty of religion.

Pity the nation that wears a cloth it does not weave,

eats a bread it does not harvest,

and drinks a wine that flows not from its own wine-press.

Pity the nation that acclaims the bully as hero,

and that deems the glittering conqueror bountiful.

Pity a nation that despises a passion in its dream,

yet submits in its awakening.

Pity the nation that raises not its voice

save when it walks in a funeral,

boasts not except among its ruins,

and will rebel not save when its neck is laid

between the sword and the block.

Pity the nation whose statesman is a fox,

whose philosopher is a juggler,

and whose art is the art of patching and mimicking.

Pity the nation that welcomes its new ruler with trumpeting,

and farewells him with hooting,

only to welcome another with trumpeting again.

Pity the nation whose sages are dumb with years

and whose strong men are yet in the cradle.

Pity the nation divided into fragments,

each fragment deeming itself a nation.

.

Khalil Gibran

January 6, 1883 – April 10, 1931

Lebanese – American Poet, artist, writer.

%d bloggers like this: