నువ్వు శరత్తులో వస్తే… ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి
నువ్వు శరత్కాలంలో వస్తే,
నేను వేసవిని పక్కకి తోసెస్తాను
సగం విసుగుతో, సగం వినోదంతో
గృహిణులు ఈగని తోలినట్లు.
నేను నిన్నొక ఏడాదిలో చూడగలిగితే
నెలలన్నిటినీ ఉండలుగా చుట్టి
ఒక్కకటీ ఒకో సొరుగులో దాచి ఉంచుతాను
వాటి వాటి సమయం వచ్చేదాకా.
ఒక వేళ శతాబ్దాలు ఆలశ్యం అవుతుందనుకుంటే,
వాటిని నా చేతివేళ్లమీద లెక్కిస్తుంటాను
వేళ్ళన్ని అయిపోయి, వాన్ డీమన్ లో *1
నా శిక్ష పూర్తయేదాకా.
జీవితం ఎప్పుడు ముగుస్తుందో తెలిస్తే,
ఎప్పుడో ఒకప్పుడు మనిద్దరిదీ ముగియవలసిందే కదా,
దాన్ని చెట్టు బెరడు విసిరినట్టు దూరంగా పారేసి
అనంతత్వాన్ని చవిచూస్తాను.
కానీ, ఇప్పటికి మాత్రం
దాని తుది ఎరుగలేని నన్ను
“గోబ్లిన్ బీ”*2 లాంటి కాలం వేధిస్తోంది
ఎప్పుడు కుడుతుందో చెప్పకుండా.
.
ఎమిలీ డికిన్సన్
December 10, 1830 – May 15, 1886
అమెరికను కవయిత్రి
(Notes:
*1 Van Dieman’s Land:
ఇది ఇప్పుడు టాజ్మానియా (Tasmania)గా (ఆస్ట్రేలియాలో భాగంగా ఉన్న ద్వీపం) పిలవబడుతున్న భాగం.
1803లో బ్రిటిషువాళ్ళు దీని కోలనీగా ఏర్పాటుచేశాక దీన్ని Penal Colony గా ఉపయోగించేవారట. ఇక్కడ కవయిత్రి ఉద్దేశ్యం (నాకు తోచినది) కాలం ఎన్నటికీ గడవదనిపించే చోటులో శతాబ్దాలు గడిచిపోయేదాకా వేళ్ళపై లెక్కిస్తూ నిరీక్షిస్తాను అని.
*2
Goblin Bee: అన్నది ఒక కల్పిత పాత్ర. చూడటానికి అసహ్యంగా ఉండి దొంగచాటుగా కుట్టిపోయే తేనెటీగ .