అమెరికాని పూర్వపు అమెరికాగా చెయ్యండి… లాంగ్స్టన్ హ్యూజ్, అమెరికను కవి.
అమెరికా మళ్ళీ అమెరికా కావాలి,
ఒకప్పుడు కలలుగన్న అమెరికా కావాలి.
ఈ ధరణిమీదే ఒక మార్గదర్శకురాలు కావాలి
గూడు కోరుకునే ప్రతి స్వేచ్ఛాజీవికీ ఇది ఆటపట్టు అవాలి.
(అమెరికా ఎప్పుడా నాకు అమెరికాలా లేదు)
అమెరికా స్వాప్నికుల తీయని కలలా ఉండాలి
అది విశ్వమానవప్రేమకి ఎదురులేని నేల కావాలి
రాజులు ఉదాశీనతవహించలేని, నియంతలు కుట్రలు పన్నలేని,
ఏ మనిషీ మరొక మనిషిని అణచలేని నేల కావాలి.
(నాకు అమెరికా ఎప్పుడూ అలా కాలేకపోయింది.)
ఓహ్! స్వతంత్రప్రతిపత్తిగల ఈ నేల దేశభక్తి అనే
మాయదారి పూలకిరీటాలు తొడగని నేల కావాలి.
అవకాశాలు నిజమైనవై, జీవితం స్వేచ్ఛగా గడిచి,
నేను శ్వాశించే గాలిలో సమానత్వం పరిమళించాలి.
(నాకు ఎన్నడూ సమానత్వం కనిపించలేదు,
స్వేచ్ఛకి మారుపేరైన నేలలో స్వేచ్ఛకనిపించలేదు.)
ఎవరది, చీకట్లో గొణుగుతున్నది?
ఎవరది నక్షత్రాలమీద ముసుగుకప్పుతున్నది?
మోసపోయి, దూరంగా తరమబడ్డ తెల్లవాణ్ణి నేను,
బానిసత్వపు మచ్చలు తొలగిపోని నల్లవాణ్ణి నేను,
ఈ నేలమీంచి తరిమివేయబడ్డ ఎర్రవాణ్ణి నేను,
కలల్ని వెతుక్కుంటూ మనసుగ్గబట్టుకుని వచ్చిన పరదేశిని నేను…
కాని చివరకు చవిచూసేదంతా అలనాటి బుద్ధిలేని పన్నాగాలే:
కుక్కల్లాపోట్లాడుకోడం, బలవంతుడు బలహీనుణ్ణి అణచివెయ్యడం
శక్తిసామర్థ్యాలు, ఆశలూగల నవయువకుణ్ణి నేను
లాభం, అధికారం, సంపాదన, భూ కబ్జా
విలువైనవన్ని కబ్జా, అవసరాలు తీర్చేవన్ని కబ్జాచెయ్యాలనే
యుగాలనాటి అంతులేని సంకెళ్లలో చిక్కుకున్నవాడిని.
మనుషుల్ని వాడుకుని, ప్రతిఫలం తీసుకుని,
అన్నీ నేనే పొందాలనే దురాశలో చిక్కుకున్నవాణ్ణి .
నేనొక రైతుబిడ్డని. నేలకి దాసుణ్ణి.
నేనొక కార్మికుణ్ణి, యంత్రానికి అమ్ముడుబోయినవాణ్ణి;
నేనొక నీగ్రోని, అందరికీ సేవకుణ్ని,
ఆకలితో, దీనంగా, అలమటించే సగటు మనిషిని…
కలలతోపాటు ఆకలితోకూడా ఉన్నవాణ్ణి,
ఓ మార్గదర్శకులారా! నేను చితికిపోయిన వాణ్ణి,
ఒక అడుగూ ముందుకు వెళ్ళలేకపోయిన మనిషిని,
తరతరాలుగా చేతులుమారుతున్న నిరుపేద కార్మికుణ్ణి.
అయినా సరే, మొట్ట మొదటి కలగన్నవాణ్ని నేనే
రాజులకి ఊడిగం చేస్తున్న పాత రోజుల్లోనే.
నాకల ఎంత సాహసోపేతమైనదీ, గాఢమైనదీ, నిజమైనదీ అంటే
ఇప్పటికీ ప్రతి ఇటుకలో, ప్రతి రాతిలో, ప్రతి నాగేటిచాలులో,
అమెరికాని అమెరికాగా చేసిన ఆ స్వేచ్ఛా గీతాలు
స్ఫూర్తిమంతంగా ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి.
ఓహ్, ఏమి చెప్పను? మనిషిముఖమెరుగని ఆ తొలి సాగరకెరటాలపై
నా కలల నేలని వెతుక్కుంటూ ప్రయాణించిన నావికుణ్ణి నేనే;
దుర్భరమైన ఐర్లండు తీరాలనీ, పోలండు మైదానాలనీ,
ఇంగ్లండు పచ్చికబయళ్ళనీ, వదిలివచ్చినవాడిని నేనే.
“స్వేచ్ఛాప్రియుల స్వర్గం” నిర్మించడానికి
చీకటిఖండపు చెలియలికట్టలు దాటివచ్చినవాడిని నేను.
స్వేచ్ఛా జీవా?
ఎవడుచెప్పేడు మేము స్వేచ్ఛా జీవులమని? నేను కాదే?
నేనైతే ఖచ్చితంగా కాదే? సహాయం పొందుతున్న లక్షలమంది కాదే?
సమ్మెచేస్తున్నపుడు కాల్చి చంపబడ్డ లక్షలమంది కాదే?
బ్రతకడానికి ఏ జీతమూ లేని వేనవేలమంది కాదే ?
మేము కన్నకలలన్నిటికీ ప్రతిఫలంగా
మేము ఆలపించిన గీతాలన్నిటికీ ప్రతిఫలంగా
మేము భద్రంగా దాచుకున్న కలలకి ప్రతిఫలంగా
మేము పట్టుకుతిరిగిన జెండాలకి ప్రతిఫలంగా
ఏ వేతనంలేని లక్షలమంది జనాభాకి ఉన్నది కేవలం…
ఆశలడుగంటినా ఇప్పటికీ మిగిలిన ఆ కల ఒక్కటే
అమెరికా మళ్ళీ అమెరికా కావాలి…
అనుకున్న లక్ష్యాలను ఇంకా చేరుకోలేకపోయిన నేల అది…
కానీ… ఇక్కడే ఏ మనిషైనా స్వేచ్ఛగా జీవించగల అవకాశం ఉంది.
ఈ నేల అందరిదీ కావాలి… ప్రతి పేదవాడిదీ, ప్రతిఇండియనుదీ, ప్రతి నీగ్రోదీ, నాదీ…
ఈ అమెరికాను అమెరికాగా మలిచింది…
వాళ్ల చెమట, రక్తం, వాళ్ళ నమ్మకం, వాళ్ల కష్టాలు,
వాళ్ల చేతులే లోహాల్ని కరిగించింది, వర్షంలో నాగలి నడిపించింది;
మళ్ళీ మన అద్భుతమైన కలని మనం రాబట్టుకోవాలి.
మీరు నన్ను ఏ పేరుతో దూషించినా సరే! ఫర్వాలేదు,
ఉక్కులాంటి స్వాతంత్ర్యానికి ఎన్నడూ తుప్పుపట్టదు,
ప్రజల జీవితాలమీద జలగల్లా బ్రతికేవాళ్లదగ్గరనుండి
మన పొలాలలని మనం తిరిగి తీసుకోవాలి,
అమెరికా! ఓ అమెరికా!
స్పష్టంగా నిర్భయంగా అంటాను,
అమెరికా ఎప్పుడూ నాకు అమెరికా కాలేకపోయింది,
అయినాసరే, ఒట్టేసి చెప్పగలను,
ఏదోనాటికి, ఇది ఆ అమెరికా అవగలదు!
శిధిలమై, జీర్ణావస్థకు చేరుకున్న దశనుండి,
బలత్కారాలూ, లంచగొండితనపు తెగుళ్ళనుండి, దోపిడీ, అబద్ధాలనుండి
ప్రజలం మనమందరం దీన్ని పునరుద్ధరించుకోవాలి,..
ఈ నేలని, ఈ ఖనిజాల్నీ, ఈ వృక్షసంపదని, ఈ జలవనరుల్ని.
పర్వతాలనీ, అనంతమైన మైదానాలనీ,
సువిశాలమైన ఈ రాష్ట్రాలనన్నిటినీ కాపాడుకోవాలి…
అప్పుడే మనం అమెరికాని పునర్నిర్మించుకోగలం .
.
లాంగ్స్టన్ హ్యూజ్
February 1, 1902 – May 22, 1967
అమెరికను కవి
.
