కవిత్వంతో పరిచయం … బిల్లీ కాలిన్స్, అమెరికను కవి
వాళ్ళని ఒక కవిత తీసుకుని
రంగు గాజుపలకని దీపానికి అడ్డంగాపెట్టి
పరీక్షించినట్టు చూడమన్నాను, లేదా
దాని గూటికి చెవిగట్టిగా ఆనించి వినమన్నాను.
కవితలోకి ఒక ఎలుకని విడిచిపెట్టి
అది బయటకివెళ్ళే దారి ఎలాకనుక్కుంటుందో గమనించమన్నాను,
లేదా కవితలోకి నడుచుకుంటూ వెళ్ళి
దాని గోడల్ని తడుముతూ స్విచ్ ఎక్కడుందో వెదకమన్నాను.
వాళ్ళని నీటిమీద స్కీయింగ్ చేస్తున్నట్టు
పద్యం ఉపరితలం మీద తేలియాడమన్నాను
ఒడ్డున ఉన్న కవి పేరువైపు చెయ్యి ఊపుతూ.
కాని వాళ్ళు చేద్దామనుకుంటున్నదల్లా
పద్యాన్ని ఒక కుర్చీకి తాడుతో కట్టి
దాన్ని హింసించి వాళ్ళ అభిప్రాయాన్ని
అంగీకరించేలా ఒప్పించడం.
అసలదేమిటో కనుక్కుందామని వాళ్ళు
దాన్ని మెత్తగా పగలగొట్టడం ప్రారంభించేరు.
.
బిల్లీ కాలిన్స్,
March 22, 1941
అమెరికను కవి
.
