కవీ – అతని కవితలూ… లాంగ్ ఫెలో, అమెరికను కవి
వసంతం వచ్చేసరికల్లా
పక్షులు ఎక్కడనుండి వస్తాయో తెలియనట్లు;
సాయంత్రం అవడం తడవు
రోదసికుహరాల్లోంచి చుక్కలు పొడిచినట్లు
మేఘాల్లోంచి చినుకులు రాలినట్లు,
భూమిలోంచి బుగ్గలు వాగులై ప్రవహించినట్లు
అంత అకస్మాత్తుగానూ, నిశ్శబ్దంలోంచి
చిన్నదో పెద్దదో చప్పుడు ఉత్పన్నమైనట్టు;
ద్రాక్షతీగకి ద్రాక్షగుత్తులు వేలాడినట్లు;
చెట్లకి పళ్ళు కాసినట్లు;
దేవదారుకొమ్మల్లో గాలి చొరబడినట్లు;
సముద్రం మీద అల్లలు ఉప్పొంగినట్లు;
క్షితిజరేఖ మీద ఓడల
తెల్లని తెరచాపలు లేచినట్లు;
పెదాలమీద చిరునవ్వు మొలిచినట్లు,
నురగలు ముందుకు తోసుకువచ్చినట్లు;
అనంతాగోచర లోకాలకుచెంది
స్పష్టాస్పష్ట ఆకృతులనుండి
అతనివైపుకు ఎగురుకుంటూ
కవికి కవిత్వం వస్తుంది:
అతని గీతాలు అతనివీ, అతనివి కావు;
అతను ఆలపిస్తాడు అంతే;
వాటి ప్రఖ్యాతి అతనిదీ, అతనిది కాదు;
స్తవనీయమైన, గర్వించదగ్గ పేరు అంతే.
అంతరాంతరాల్లో పదాలు అందీ అందక
అతన్ని రాత్రింబవళ్ళు వెంటాడుతుంటాయి,
“వ్రాయి!” అని అంతర్వాణి అనుజ్ఞ ఇవ్వగానే
అతను దాన్ని అనుసరిస్తాడు, అనుసరించాలి కూడా.
.
HW లాంగ్ ఫెలో
February 27, 1807 – March 24, 1882
అమెరికను కవి
.
Ultima Thule
L’Envoi.
The Poet and his Songs
.