రోజల్లా దానిగురించి ఆలోచిస్తాను, రాత్రయేక చెబుతుంటాను.
నేను ఎక్కడినుండి వచ్చేను, నేను ఇక్కడ చెయ్యవలసినదేమిటి?
నాకైతే ఏమీ తెలియదు.
నా ఆత్మ మాత్రం ఎక్కడిదో… అది మాత్రం నిశ్చయం,
నేను చివరకి అక్కడకి చేరుకోవాలనుకుంటున్నాను.
ఈ తాగుడు అలవాటయింది వేరే పానశాలలో.
నేనక్కడికి చేరుకున్నానంటే,
నాకు మత్తు పూర్తిగా వదులుతుంది. ఈ మధ్యకాలంలో
నేను ఖండాంతరం నుండి వచ్చి పక్షిశాలలో కూర్చున్న పక్షిలా ఉన్నాను,
నేను ఎగిరిపోవలసిన రోజు దూరంలో లేదు.
కానీ, ఎవరది నా చెవిలో చెవిపెట్టి నాపాట వింటున్నది?
ఎవరది నా పెదాలతో తనమాటలు మాటాడుతున్నది?
ఎవరది నాకళ్ళతో ప్రపంచాన్ని చూస్తున్నది? ఆత్మ అంటే ఏమిటి?
నా ప్రశ్నల పరంపర ఆగదు.
నేను ఒక ప్రశ్నకైనా సమాధానాన్ని అర్థం చేసుకోగలిగితే
నేను ఈ తాగుబోతుల చెరనుండి బయటపడగలను.
నా అంతగా నేను ఇక్కడికి రాలేదు, నా అంతగా నేను పోలేను.
నన్నెవరు ఇక్కడికి తీసుకువచ్చేరో వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళవలసిందే.
ఈ కవిత్వం… నేను ఏమిటి చెప్పబోతానో నాకే తెలీదు.
నేను ముందుగా ఏదీ అనుకోను.
నేను ఏదీ చెప్పకుండా ఉన్నప్పుడు, నేను ప్రశాంతంగా ఉండి, మాటే మాటాడను.
ఇక్కడ చాలా పెద్ద సారా పీపా ఉంది. కానీ పానపాత్రలే లేవు.
అది మాకు ఫరవా లేదు. మేము ప్రతిరోజూ ఉదయాన,
మళ్ళీ సాయంత్రమూ జ్వలిస్తుంటాం.
వాళ్లు మాకు పుట్టగతులు లేవంటారు. వాళ్ళు సరిగ్గా చెప్పి ఉండొచ్చు.
అదీ మాకు ఫరవాలేదు.
.
జలాలుద్దీన్ రూమీ, పెర్షియను కవి,
ప్రముఖ సూఫీ కవి.
.

Image Courtesy: http://en.wikipedia.org/wiki/Rumi
స్పందించండి