అనువాదలహరి

విలంబనము… ఎలిజబెత్ జెన్నింగ్స్, బ్రిటిషు కవయిత్రి

ఈ క్షణం నా మీద ప్రసరిస్తున్న నక్షత్ర కాంతి

ఎన్నో ఏళ్ళక్రిందట మెరిసినది. ఇప్పుడు అక్కడ

మిలమిలలాడుతున్న కాంతిని నా కనులు బహుశా చూడలేకపోవచ్చు,

ఈ కాల విలంబనము ఎలాగా అని నన్ను ఊరిస్తూంటుంది.

ఇపుడు నన్ను ప్రేమిస్తున్న ప్రేమ నాదగ్గరకు చేరకపోవచ్చు

దాని తొలి లాలసలు తీరేదాకా. కళ్ళు చూచి అందంగా

ఉందని గుర్తించేదాకా, ఆ తారకావేశం నిరీక్షించాల్సిందే

మనల్ని చేరుకున్న ప్రేమ, మనం ఇంకెక్కడో ఉండగా చేరొచ్చు.

.

ఎలిజబెత్ జెన్నింగ్స్

బ్రిటిషు కవయిత్రి.

బ్రిటన్ లో అండర్ గ్రౌండ్ రైలు మార్గంలో ప్రజలకు కవిత్వం చేరువగా తీసుకునివెళ్ళాలన్న తలంపుతో కొందరు యువకవులు చేసిన ప్రయత్నంలో భాగంగా గత శతాబ్దంలో ఎందరో కవులూ, ఎన్నో చక్కని కవితలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. ప్రజలనాల్కలమీద నిలబడ్డదే కవిత. అలాంటి బహుళజనాదరణ పొందిన కవితల్లో ఇదొకటి.

మననుండి నక్షత్రాలు కొన్ని కాంతి సంవత్సరాల దూరం ఉంటాయన్న ఒక భౌతిక సత్యాన్ని ప్రేమకు అనువర్తించి,  ఆ దూరాన్ని కాలప్రమాణంతో పోల్చినపుడు  మన ఆయుఃప్రమాణం దానికంటే తక్కువగనక, మనల్ని నిజంగా చేరుకునే (చుక్కల వెలుగులాంటి ) ప్రేమ ఒక్కోసారి మనం బ్రతికుండగా చేరదుసుమా అని హెచ్చరిస్తూ వ్రాసిన అందమైన కవిత.

.

Delay

.

The radiance of the star that leans on me

Was shining years ago. The light that now

Glitters up there my eyes may never see,

And so the time lag teases me with how

Love that loves now may not reach me until

Its first desire is spent. The star’s impulse

Must wait for eyes to claim it beautiful

And love arrived may find us somewhere else.

.

Elizabeth Jennings

British Poetess

%d bloggers like this: