అనువాదలహరి

కరుణారసం … విలియం షేక్స్పియర్

కరుణ రసానికి ఎన్నడూ లోటురాదు…నిరంతరం

అది సన్నని తుంపరలా దివినుంది జాలువారుతూనే ఉంటుంది

క్రిందనున్న ఈ భువికి; దాని అనుగ్రహం ద్విగుణం…

అటు దాత, ఇటు గ్రహీత ఇద్దరూ ధన్యులౌతారు.

అది బలవంతులలోకెల్ల బలమైనది;  అది

కిరీటంకంటే, దాన్ని ధరించిన చక్రవర్తిలా సమున్నతం;

దర్పానికీ, విభ్రమానికీ చిహ్నమైన రాజ దండం

కేవలం లౌకికాధికారాన్ని మాత్రమే సూచిస్తుంది;

అందులోనే రాజులపట్ల భయభీతులు నిక్షిప్తమై ఉంటాయి;

కానీ, కరుణ రాజ్యాధికారానికి అతీతమైనది;

అది ప్రభువుల హృదయపీఠాలనధిరోహిస్తుంది,

సాక్షాత్తు అది భగవంతుని గుణవిశేషమే;

కరుణరస స్పర్శతో న్యాయవితరణజరిగినపుడు

ఈ లౌకికాధికారం దైవనిర్ణయంతో తులతూగుతుంది

కనుక ఓ యూదుడా! న్యాయమే నీ కోరిక అయినప్పటికీ

ఇదికూడా ఆలోచించు; న్యాయమార్గంలో నడుస్తున్నప్పుడు

మనమెవ్వరమూ మోక్షాన్ని అందుకోలేకపోవచ్చు;

మనందరం భగవంతుని కరుణించమని ప్రార్థిస్తాము;

ఆ ప్రార్థనే, మనందరమూ మనచేతలలో

కరుణచూపించవలసిన బాధ్యతని బోధిస్తోంది;

నేను ఇంతసేపు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే

నీ వాదనలోని న్యాయతీవ్రతని తగ్గించడానికి;

నువ్వు దానికే గట్టిగా పట్టుబడితే, ఖచ్చితమైన ఈ వెనిస్ కోర్టు

అదిగో, ఆ వర్తకుడికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వవలసి ఉంటుంది.

.

విలియం షేక్స్పియర్

విలియం షేక్స్పియర్ ఒక గొప్ప నాటక కర్త.  ఆ రోజుల్లో కవిత్వ సంప్రదాయం అంతా నాటక బద్ధమే. అంటే కవి తన కవితాప్రతిభని ప్రదర్శించడానికి నాటకమే ఒక మాధ్యమం. షేక్స్పియర్ అందుకే నాటకాలలో ఎక్కడ అవకాశం వచ్చినా విడిచిపెట్టక తన భావుకతని ఉదాత్తమైన ప్రమాణాలకు తీసుకెళ్ళేడు.

 
హామ్లెట్ లో ప్రథానపాత్రద్వారా వేర్వేరు సందర్భాలలో పలికించిన కవిత్వం, వేదాంతం, పొలోనియస్ తనకొడుకు చదువుకు పారిస్ వెళుతున్నప్పుడు ఇచ్చిన హెచ్చరికలు (Polonius’ advice to his son), Merchant of Venice లో పోర్షియా చిత్రాన్ని వెతుక్కునే సందర్భంలో వరులు చేసే విశ్లేషణలు, As You Like itలోని All The World is a stage అన్న కవిత, ఇలా ఒకటేమిటి ప్రతి నాటకంలోనూ అతని కవిత్వ ప్రతిభ చూపించేడు. నిజానికి ఇలాంటివన్నీ ఒకచోట చేర్చితే, మనిషి తనజీవితంలో అనుభవించే అన్నిరకాల అనుభూతులలో, అవస్థలలో ఏ ఒక్కటీ వదిలిపెట్టకుండా, ఒక రసావిష్కరణ చేసేడని మనకి అర్థం అవుతుంది. సాహిత్యం మనుషులని సంస్కరించలేకపోవచ్చునేమో గాని, వ్యక్తి సంస్కరించబడడానికి అనువైన వాతావరణం సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు.

అతని సానెట్లు నాటకరంగపు పరిధిలో ఇమడలేక అతనిలో దాగున్న కవి వెలిబుచ్చిన ఆర్తి అని మనం అనుకోవచ్చు.

 Merchant Of Venice లోంచి తీసుకున్న ఈ కవితలో… చివరి అంకం కోర్టుసీనులో సాటి జీవులపై మనిషి అసలు ఎందుకు కరుణచూపించాలి అని షైలాక్ అడిగినప్రశ్నకి సమాధానంగా చెప్పిన  ఈ “Quality Of Mercy”  (కరుణతత్త్వం) చదువుతున్నప్పుడు మనసు ద్రవించక మానదు.

.

William Shakespeare

.

The quality of mercy is not strain’d

.

The quality of mercy is not strain’d,

It droppeth as the gentle rain from heaven

Upon the place beneath: it is twice blest;

It blesseth him that gives and him that takes:

‘Tis mightiest in the mightiest: it becomes

The throned monarch better than his crown;

His sceptre shows the force of temporal power,

The attribute to awe and majesty,

Wherein doth sit the dread and fear of kings;

But mercy is above this sceptred sway;

It is enthroned in the hearts of kings,

It is an attribute to God himself;

And earthly power doth then show likest God’s

When mercy seasons justice. Therefore, Jew,

Though justice be thy plea, consider this,

That, in the course of justice, none of us

Should see salvation: we do pray for mercy;

And that same prayer doth teach us all to render

The deeds of mercy. I have spoke thus much

To mitigate the justice of thy plea;

Which if thou follow, this strict court of Venice

Must needs give sentence ‘gainst the merchant there.
.

William Shakespeare

%d bloggers like this: