పెళ్ళిచేసుకోమని ఒక స్త్రీని అర్ధిస్తున్న వానికి హితవు … కేథరీన్ ఫిలిప్స్, ఇంగ్లీషు- వెల్ష్ కవయిత్రి
నిలు నిలు, ధైర్యశాలీ! ఇదంతా స్వర్గ ధామమే.
నువ్వు ఏది ప్రమాణం చేసిచెపుతున్నావో
ఇతరులకి అది పెండ్లికి అభ్యర్థిస్తున్నట్టు కనిపించొచ్చు
ఆమెపట్ల అది మహాపచారం.
ఆమె ప్రజలందరికీ ఆరాధ్య దేవత.
ఒక చిన్న అనామకమైన ఇంట్లో దేవతలా
ఆమె కొలువై ఉండడం
చూడ్డానికి చాలా వింతగా అనిపించదూ?
ముందు ఒక పని చెయ్యి. లోకానికి సెలవు చెప్పి
సూర్యుణ్ణి నీ ఒక్కడికోసం ప్రకాశించమను.
అతడు తన కిరణాలన్నిటితో
నీకు పరిపూర్ణత ప్రసాదించనీ.
అల జరగడం లేదని ఒకవేళ నిరాశపడుతుంటే
ఆ కిరణాలకంటే, విశాలమూ ప్రకాశమూ ఐన
ఆమె వెలుగులని కొద్దిజాగాకి పరిమితం చెయ్యడం
ఎంత పొరపాటో ఒకసారి ఆలోచించు!
.
కేథరీన్ ఫిలిప్స్ (ఓరిండా)
(1 January 1632 – 22 June 1664)
ఇంగ్లీషు- వెల్ష్ కవయిత్రి, అనువాదకురాలు, చదువరి
.
