మిన్నోలు (నెత్తళ్ళు) … జాన్ కీట్స్, ఇంగ్లీషు కవి
ఆ వంపునుండి ఎంత సడిలేకుండా పారుతోందీ నీరు;
ఈ వేలాడుతున్న సాలవృక్షాలకొమ్మల్లో
పిసరంత గుసగుసలైనా చెయ్యదు; వెలుగునీడలు
ఆ గడ్డి పరకలమీంచి నెమ్మదిగా పాకురుతూ పోతున్నాయి—
ఎంత నెమ్మదంటే, ఆ గులకరాళ్ళ తిన్నెలమీద
ప్రవాహం చేరి ఒక జీవిత సత్యాన్ని బోధించే లోపు
మనం రెండు సానెట్లు చదువుకోవచ్చు.
అక్కడికి నెత్తళ్ళు గుంపులుగా వచ్చి తలలు పైకెత్తుతాయి
ప్రవాహానికి వ్యతిరేకంగా తమ శరీరాలు నిలిపి
నీటి తాకిడికి చల్లబడిన సూర్యకిరణాలని
ఒక్క సారి తనివిదీరా ఆస్వాదించడానికి…
ఆనందపారవశ్యంలో కొట్టుకుంటూనే,
తమ జరీరంగు పొట్టల్ని ఆ ఇసక తిన్నెల్లో
ఒద్దికగా సర్దుకుంటున్నాయి.
నువ్వు ఏ మాత్రం చెయ్యి ముందుకి జాచేవో,
మరుక్షణం అందులో ఒక్కటికూడా కనిపించదు;
కానీ, కళ్ళు ఇటువైపు తిప్పిచూడు, అన్నీ మళ్ళీ ప్రత్యక్షం;
ఆ అలలకి కూడ ఈ చిన్న తావులలోకి చేరి, ఇక్కడి
ఆకుపచ్చని కేశాలలో సేదదీరడమంటే ఇష్టమేమో.
అలా సేదదీరుతూ, అవి ఒకింత హాయిని కలుగజేజేస్తూ
ఈ పచ్చని పొదరిళ్ళు శాశ్వతంగా ఉండడానికి తేమనిస్తాయి.
.
జాన్ కీట్స్
31 October 1795 – 23 February 1821
ఇంగ్లీషు కవి
.
