అందరితోనూ ఒంటరిగా… చార్ల్స్ బ్యుకోవ్ స్కీ, అమెరికను కవి
ఎముకల్ని మాంసఖండాలు కప్పుతాయి,
మధ్యలో
ఒక మెదడునీ,
అప్పుడప్పుడు
ఒక ఆత్మనీ
పెడతారు ఎవరో;
స్త్రీలు గోడకి విసిరి
పగలగొడతారు పుష్ప కలశాల్ని;
మొగాళ్ళు
పూటుగా తాగుతారు;
ఎవరికీ
వాళ్ళు కోరుకున్నవాళ్ళు
దొరకరు
అయినా
అయినా
ఎదురుచూస్తునే
పక్కలమీదకి ఎక్కడం
దిగడం మానరు.
మాంసఖండం
ఎముకల్ని కప్పుతుంది.
మాంసం
మాంసాన్ని మించి
ఇంకేదో కోరుకుంటుంది;
ఏమాత్రం
అవకాశం లేదు!
మనందరం
అద్వితీయమైన విధి చేతులో
చిక్కుకున్నాం.
ఎవరికీ వాళ్ళకి
కావలసింది దొరకదు.
నగరంలో పెంటకుప్పలు నిండుతున్నాయి.
చెత్తకుప్పలు నిండుతున్నాయి
పిచ్చాసుపత్రులు నిండుతున్నాయి
ఆసుపత్రులు నిండుతున్నాయి
గోరీలు నిండుతున్నాయి.
మరేదీ
నిండటం లేదు.
.
చార్ల్స్ బ్యుకోవ్ స్కీ
August 16, 1920 – March 9, 1994
జర్మను-అమెరికను కవి
.
