అర్థ రాత్రి పచార్లు చేస్తున్న అబ్రహాం లింకన్ … వాషెల్ లిండ్సే, అమెరికను కవి
ఏదో అమంగళ సూచన, ఈ దేశానికి చెందిన ఆకారం
అర్థరాత్రపుడు, అతిసామాన్యమైన మా నగరంలో,
సంతాపంతో తిరుగుతోంది, ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా,
అదిగో కోర్టుకి దగ్గరగా, అటూ ఇటూ పచార్లు చేస్తోంది.
తన ఇంటికి పక్కగా, నీడలు పాకే అతని ఆవరణలలో
తనపిల్లలు ఒకప్పుడు ఆడుకున్న జాగాలో మెల్లగా ఆగి ఆగి
ఒకోసారి బజారులో చరిస్తూ, అరిగిపోయిన రాతి బాటమీదా
నక్షత్రాలు నివురుగప్పేదాకా అడుగులో అడుగువేసుకుంటూ…
ఒక పొడవాటి వెల్లబారిన మనిషి పాత సూటులో
పేరుబడ్డ High Top Hat తో, జీర్ణమైన సాదా శాలువతో
చిత్రంగా కనిపిస్తూ; ఒకప్పుడు ప్రజలందరూ ప్రేమించిన వ్యక్తి,
ఒక చిన్న పల్లెటూరి న్యాయవాది, మనందరికీ నాయకుడు.
ఇప్పుడు తను సమాధిలో నిద్రపోలేకపోతున్నాడు.
అతను మనమధ్య తిరుగుతున్నాడు… పాతరోజుల్లోలా.
తీరికలేకుండా తిరుగుతూ, ఝామురాత్రిదాకా మేలుకుండేవారు
తలుపుపక్కనుండి వెళ్ళడం చూస్తే గట్టిగా ఊపిరి తీసి, అవాక్కవుతారు.
అతని తల వాలి ఉంటుంది. తను రాజులూ ప్రజలగురించి ఆలోచిస్తాడు.
నిజమే. ప్రపంచం ఖాయిలాపడి ఏడుస్తుంటే తనెలా నిద్రపోగలడు?
కారణం తెలీదు, కానీ చాలా మంది రైతులు పోరాడుతున్నారు,
చాలా కుటుంబాలు దోపిడీకి గురై అలమటిస్తున్నాయి.
యుద్ధోన్మాదుల ఆగడాలు అతని గుండె రగిలుస్తున్నాయి
ప్రతి సముద్రంలోనూ అతనికి యుద్ధనౌకలే కనవస్తున్నాయి
అతనిపుడు భుజం చుట్టూ కప్పుకున్న శాలువతోపాటు మోస్తునాడు
వాళ్ళ తెలివితక్కువలనీ, బాధనీ, దిగమింగలేని వేదననీ.
అతను ఒక శుభోదయం అయేదాకానిశ్చింతగా ఉండలేడు;
… యూరోపు స్వేచ్ఛగా ఉండడానికి ఆశాకిరణమైన
మేధావివర్గ సమాఖ్యలూ, ప్రపంచ కార్మికులూ,
దేశానికీ, ప్రపంచానికీ శాశ్వతశాంతి తీసుకువచ్చేదాకా.
ఇంకా రాజ్య హింస కొనసాగడం అతన్ని కలవరపరుస్తోంది
అతను ఈ ప్రజలకోసం కష్టపడి, వెచ్చించిన కాలమంతా
నిష్ఫలంగా కనిపిస్తోంది. సమాధిలో తను నిద్రించడానికి వీలుగా,
ఎవరు అకళంకమైన శాంతిని తీసుకురాగలరు?
.
లిండ్సే వాషెల్
(1879 – 1931)
అమెరికను
.
