మా ఇంట్లో అందమైన కర్టెన్లు వేలాడుతూ మరుగుపరిచే
వెడల్పు ఏకాండీ కిటికీ ముందున్న మేజాబల్ల మీద అక్వేరియంలో
“గోల్డ్ ఫిష్” గుండ్రంగా తిరుగుతూ ఉండేవి;
మా అమ్మ, ఎప్పుడూ నవ్వుతూ, మేమందరం
ఆనందంగా ఉండాలని చెబుతూ ఒకసారి
” హెన్రీ! ఆనందంగా ఉండరా!” అంది.
నిజమే. ఉండగలిగితే
ఆనందంగా ఉండడం మంచిదే.
కానీ మా నాన్న నన్నూ మా అమ్మనీ వారంలో ఎన్నోసార్లు
కొడుతూ ఉండేవాడు, ఆరడుగుల రెండంగుళాల విగ్రహం
లోపల కోపంతో రగిలిపోతూ, ఎందుకంటే అతన్ని లోపలనుండి
ఏది ప్రేరేపిస్తోందో అతనికే అర్థమయేది కాదు.
మా అమ్మ ఒక వెర్రి చేప. వారానికి రెండుమూడుసార్లు దెబ్బలు తింటున్నా ఆనందంగా ఉండాలనుకునేది, నన్నుకూడా ఆనందంగా ఉండమని చెబుతూ, “హెన్రీ, ఏదీ నవ్వు? ఒక్కసారికూడా నవ్వవేమిరా?”
అని అంటూ తనుకూడా నవ్వేది, ఎలానవ్వాలో నాకు చూపించడానికి. కానీ, అంత విషాదకరమైన నవ్వు నేనెన్నడూ చూడలేదు.
ఓ రోజు ఆ గోల్డ్ ఫిష్ ఐదూ చచ్చిపోయాయి పక్కకి వాలిపోయి నీటిమీద తేలాయి కళ్ళు అలా తెరుచుకుని; మా నాన్న ఇంటికి వచ్చిన తర్వాత వాటిని పిల్లికి వంటగది గుమ్మదగ్గర నేలమీదకి విసిరేసాడు మా అమ్మ అదిచూసి నవ్వింది. . ఛార్ల్స్ బ్యుకోవ్ స్కీ August 16, 1920 – March 9, 1994)
జర్మన్- అమెరికను
ఈ కవితలో అద్భుతమైన శిల్పం ఉంది. గొప్పకవులెప్పుడూ ప్రతీకలనీ, వాటిని వేటికి అనువర్తిస్తున్నారో ఆ వస్తువుకీ మధ్య గల సారూప్యాన్నీ చక్కగా వాడుకుంటారు.
తల్లి నవ్వు మొదట చెప్పినప్పుడు, అంతటి విషాదకరమైన నవ్వు ముందెప్పుడూ చూడలేదన్నాడు. ఆమె తన తండ్రి చేతిలో తన్నులు తింటున్నా ఆనందంగా ఉండాలని తాపత్రయపడేది. కానీ, చాలా చమత్కారంగా, ఏ పోలికా పైకి చెప్పకుండానే, అక్వేరియంలో చేపలనీ, అవి గుండ్రంగా ఆ పాత్ర పరిధిలోనే గుడుగుడుగుంచంలా తిరగడాన్నీ పేర్కొన్నాడు. తన తల్లిది ఆ చేపల్లా ఎంత మొనాటనస్ జీవితమో సూచించాడు దానిద్వారా. ఆమెని, “Poor Fish” అని వర్ణిస్తాడు. ఆ మాటని వినియోగించడంలో కవి ఎంత మెలకువగా, నేర్పుగా తల్లికీ చేపలకీ సామ్యాన్ని సూచించాడో గమనించవచ్చు. చివరకి “గోల్డ్ ఫిష్” చనిపోయి పిల్లికి విసిరెస్తే తల్లి నవ్వుతుంది. ఎందుకు? వాటికి విముక్తి కలిగిందికదా అన్న సంతోషంతో. అంటే, తనకి మృత్యువుతప్ప వేరే విముక్తి మార్గం లేదని. అందుకే ఆ నవ్వు గుర్తుంచుకోవలసిన నవ్వు అని కవి తాత్పర్యం…
Charles Bukowski (Photo credit: Wikipedia)
.
.
A Smile To Remember
.
We had goldfish and they circled around and around in the bowl on the table near the heavy drapes covering the picture window and my mother, always smiling, wanting us all to be happy, told me, “be happy Henry!” and she was right: it’s better to be happy if you can but my father continued to beat her and me several times a week while raging inside his 6-foot-two frame because he couldn’t understand what was attacking him from within.
My mother, poor fish, wanting to be happy, beaten two or three times a week, telling me to be happy: “Henry, smile! why don’t you ever smile?”
And then she would smile, to show me how, and it was the saddest smile I ever saw
One day the goldfish died, all five of them, they floated on the water, on their sides, their eyes still open, and when my father got home he threw them to the cat there on the kitchen floor and we watched as my mother smiled.
.
Charles Bukowski
August 16, 1920 – March 9, 1994)
German-born American Poet, Novelist and short-story Writer.