ఆరితేరిన సైనికుడు… ఛార్లెస్ సిమిక్, సెర్బియన్- అమెరికను కవి
నాకు పదేళ్ళు వచ్చేసరికి
నేను కొన్నివందల యుద్ధాల్లో పాల్గొన్నాను,
లెక్కలేనన్ని గాయాలయ్యాయి,
కొన్ని వేల మందిని హతమార్చాను.
మా అమ్మ నన్ను చెయ్యిపట్టుకుని
తోటలోకి చకచకా లాక్కెళ్ళింది.
వాకచెట్లు పూలతో నిండుగా ఉన్నాయి.
గడ్డిలో ఒక పిల్లి ముడుచుకు పడుకుంది.
దాని తోక లాగుదామనుకున్నాను గాని
పోనీ ఎందుకులే అని దానిమానాన్న వదిలేశాను.
విమానదాడి పూర్తయ్యాక ఆకసం నిండా
పక్షులూ, నిప్పుకణికలూ ఎగురుతున్నాయి.
కానీ, నా కాళ్ళదగ్గర చీమలు మాత్రం
కూలుతున్న గోడలను ఆనుకుని
తమపనులు చేసుకుంటూ పరిగెడుతున్నాయి.
అన్నట్టు నా కత్తి గురించి చెప్పడం మరిచేను
అది అట్టముక్కతో చేసిందే అనుకోండి,
అయితేనేం, దాని పిడి బంగారు రంగు వేసింది.
ఇప్పుడు నాకు ఒక గుర్రం కావాలి
మొన్న నే చూశానే హుషారుగా తోకాడించుకుంటూ
శవపేటిక ఈడ్చుకెళ్ళింది… అలాంటిది.
.
ఛార్లెస్ సిమిక్,
9 May 1938 –
సెర్బియన్ అమెరికను కవి
.
యుద్ధం అంటే పిల్లలకి ఎలాంటి ఆటవస్తువో, దాని పర్యవసానాలగురించి వాళ్ళకి ఏ అవగాహన ఎలా ఉండదో చెప్పే కవిత ఇది.
.
