నిశ్శబ్దపు నిట్టూరుపు… జాన్ కీట్స్, ఇంగ్లీషు కవి
ఆ చిన్ని గుట్టమీద మునివేళ్ళమీద నిలబడ్డాను;
వాతావరణం చల్లబడుతూ ఆకు అల్లాడకుండా ఉంది.
సుకుమారమైన మొగ్గలు కించిత్ గర్వంతో
ఒక పక్కకి తలవాల్చి ఉన్నాయి,
ఒకటీ అరా ఆకులతో సన్నగా మొనదేలిన కొమ్మలు
తొలి వేకువ నిట్టూర్పులలో చిక్కిన వాటి
నక్షత్రఖచితమైన మకుటాల్ని ఇంకాకోల్పోలేదు.
మేఘాలు తెల్లగా స్వచ్ఛంగా, అప్పుడే ఉన్నితీసిన గొర్రెలు
ఏటిలో మునకేసివచ్చినంత నిర్మలంగా ఉన్నాయి,
నిశ్శబ్దం విడిచిన గాఢమైన నిట్టూర్పునుంచి వెలువడిన
సడిలేని సవ్వడేదో ఆకులదొంతరలలో కదలాడింది;
ఎందుకంటే ఆ పచ్చదనంపై విరిసిన అన్ని చాయలలోనూ
పిసరంతైనా కదలికల జాడ ఎక్కడా కనరాలేదు.
.
జాన్ కీట్స్
31 October 1795 – 23 February 1821
ఇంగ్లీషు కవి
