అనుభవిస్తున్న దుఃఖాన్ని మాటల్లో చెప్పడం
నా కొక్కసారి ఒక పెద్ద అపరాధంలా అనిపిస్తుంది.
ఎందుకంటే, ప్రకృతిలాగే, మాటలుకూడా
వ్యధాత్మని సగమే ఆవిష్కరించి సగం మరుగుపరుస్తాయి.
అయితే, బాధాతప్తమైన మనసుకీ హృదయానికీ
ఆచితూచి ఉపయోగించిన మాటలవల్ల ప్రయోజనం లేకపోలేదు;
ఈ విషాదకరమైన యాంత్రిక అభ్యాసము
మాదకద్రవ్యాల్లా, బాధతెలియకుండా మొద్దుబారుస్తుంది.
చలినుండికాపాడుకుందికి ముతకవస్త్రాలు ధరించినట్టు
నేను కలుపుమొక్కల్లాంటి మాటలను పెనవేసుకుంటాను.
అయితే, వాటిలో నిక్షిప్తమైన అపారమైన దుఃఖాన్ని
అవి కేవలం రేఖామాత్రంగా రూపుకట్టగలవు. అంతే!
.
ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నీసన్
(6 August 1809 – 6 October 1892)
ఇంగ్లీషు కవి.
ఇది లార్డ్ టెన్నీసన్ తన మిత్రుడు, తన సోదరితో నిశ్చితార్థం జరిగి, వివాహం సంపన్నం కాకుండానే మరణించిన Arthur Henry Hallam స్మృతిలో రాసిన In Memorium కావ్యం లోనిది. ఈ కావ్యం అతనికి బహుళప్రచారముతోపాటు అజరామరమైన కీర్తితెచ్చిపెట్టింది.
ఇందులో 133 విభాగాలున్నాయి, ప్రతి విభాగంలోనూ abba అన్న అంత్యానుప్రాసతో నాలుగు పాదాలున్న పద్యాలున్నాయి. ఈ ఛందస్సు టెన్నీసన్ కనిపెట్టేడని ప్రతీతి. ఇందులో ముఖ్యంగా అతను చెప్ప ప్రయత్నించినది, శోకానికి గురైన మనసు దాని నుండి తేరుకునే మార్గం. అందుకని abba అనులోమ విలోమం అనుగుణంగా ఉందని పండితుల సిద్ధాంతం.
మనం ముఖ్యంగా గమనించవలసినది …. “మనం ఉపయోగించే పదాలకు మనలోని
భావాలను వెలిబుచ్చడంలో కొన్ని పరిమితులున్నాయి” అని కవి చేస్తున్న హెచ్చరిక.
.
.

స్పందించండి