దూలాల్ని, ద్వారబంధాల్ని, ఎన్ని అవసరాలో అన్నిటినీని
మనం ఒక మొక్క నాటుతున్నామంటే ఒక ఇంటిని నాటుతున్నాం.
మనం ఒక మొక్క నాటుతున్నామంటే ఏమిటి నాటుతున్నాం?
మనం రోజూ చూసే వేలరకాల వస్తువుల్ని;
మన గోపురాలని తలదన్నే మెట్లని నాటుతున్నాం,
మన దేశపతాకాన్ని ఎగరేసే జండాకొయ్యని నాటుతున్నాం,
ఎండనుండి రక్షించే ఒక ఒక నీడని నాటుతున్నాం
మనం ఒక మొక్కనాటుతూ ఇవన్నీ నాటుతున్నాం.
.
హెన్రీ ఏబీ
జులై 11, 1842 – జూన్ 7, 1911
అమెరికను కవి.
సాహిత్యంలో ఒకే ఒక్క కవితతో అజరామరమైన కీర్తి సంపాదించిన వాళ్ళు చాలా తక్కువ. అటువంటి అతితక్కువమంది కవుల్లో హెన్రీ ఏబీ ఒకడు.
మనకి తెలిసిన విషయాలే అవొచ్చు. కానీ, చెప్పే విధానంలోనే తేడా. చిత్రకారులందరికీ అవే కుంచెలు, అవే రంగులు; ఒక భాషకి చెందిన కవులందరికీ అదే వర్ణమాల, అవే పదాలూ అవే ప్రయోగాలూ. కానీ జాషువాలూ, కరుణశ్రీలూ, రవివర్మలూ, వడ్డాది పాపయ్యలూ, బాపూలు వందలకొద్దీ పుట్టుకురారేమి? జాషువా, కరుణశ్రీ పద్యాలు చదువుతుంటే మనకి బుర్రకొట్టుకున్నా పలకని శబ్దాలు, వాళ్ళకేమిటి, అడుగులకి మడుగులొత్తుతూ పడుతున్నాయా అనిపిస్తుంది. రవివర్మదో, వ.పా.దో, బాపూదో బొమ్మ చూస్తుంటే వీళ్ళ కళ్ళకీ, వేళ్ళకీ మధ్య ఏదో తెలియని పురాకృత సంబంధం ఉందేమోననిపిస్తుంది.
కొన్ని కవితలు పైన చెప్పిన ఏ సొగసులూ లేకపోయినా, వాటిలోని అంతర్లీనమైన సౌందర్యానికి, తాత్త్విక భావనకి, అభివ్యక్తి వెనక ఉన్న ఉదాత్తమైన పరిశీలనకి, దానికి మనం ఎన్ని రకాలుగా వ్యాఖ్యానించదలుచుకుంటే, అన్నిరకాలుగా వ్యాఖ్యానించడానికి అనువుగా ఉంటూనే, ప్రతి వ్యాఖ్యానమూ మనోరంజకంగా ఉండడంలోనే వాటి నిరాడంబర సౌందర్యం ఉంటుంది. అదిగో సరిగ్గా అలాంటి కవితే ఇది. ఇక్కడ ఉపమలూ, ఉత్ప్రేక్షలూ, రూపకాలూ మొదలైన ఏ అలంకారాలూ లేవు; గంభీరమైన పదప్రయోగాలూ లేవు; కవి చాలా ప్రశాంతంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేడు. కేవలం సహజోక్తి. అరే. సహజోక్తిలో ఇంత ప్రభావం ఉంటుందా అని ఆశ్చర్యపోయేట్టు చేశాడు కవి.
దీన్నిప్పుడు కవిత్వానికి అన్వయించి చూడండి.
మీరు కవితని నాటుతున్నారంటే ఏమిటి నాటుతున్నారు? మీ సున్నితమైన స్పందనని నాటుతున్నారు, మీ కన్నీళ్ళని నాటుతున్నారు. మీ బాధల్ని నాటుతున్నారు. మీ విరహాల్ని నాటుతున్నారు. మీ ఆనందాల్ని, మీ సంతోషాల్ని, మీ సమస్యలని, మీ అవగాహనని, మీ వైరుధ్యాల్ని, మీ వైషమ్యాల్ని, మీ సంస్కారాన్ని… మీరొక వ్యక్తిత్వాన్ని నాటుతున్నారు.
మీరు ఒక కవితని నాటుతున్నారంటే ఏమిటి నాటుతున్నారు? మీ స్మృతిపథంలో బంధించిన ఒక కాలరేఖని నాటుతున్నారు. మీరు చేదుకున్న అనుభవాన్ని నాటుతున్నారు. ఒక జాతి సంస్కృతిని నాటుతున్నారు. మీ వారసత్వాన్ని నాటుతున్నారు. మీరు దర్శించిన ప్రకృతిని నాటుతున్నారు. మీ వివేచనని, మీ కల్పనని, మీ అధ్యయనాన్ని, మీ ఊహా చిత్రాల్ని, మానవాళి మహోన్నత ఆశయాల్ని, మీరు కంటున్న అపూర్వమైన కలని నాటుతున్నారు. మీరొక పరిణతి చెందిన మనీషిని, విశ్వనరుడ్ని నాటుతున్నారు.
సాహిత్య ప్రక్రియ ఏది కానీండి, ఇది గుర్తుంచుకుంటే, మన సమిష్ఠి కృషి, చేతన అయిన సాహిత్యం మానవకళ్యాణానికి ఉపకరించే దిశలో వెళుతుందని నా ప్రగాఢమైన విశ్వాసం.
When one generation plants trees, they’ll be useful to the next genearations in many ways. The person who planted it may not enjoy the fruits or benefits of it, ut surely he knows that his grandchildren would reap the benefits. Hats off to Henry Abbey – the Telugu version is equally inspiring. Thanks for sharing.
స్పందించండి