నేనే మెత్తనిదాన్నై ఉండి, అందంగా ఉండి
నా మనసు నీ పాదాలముందు పరిచితే;
నా మనసులోని ఆలోచనలన్నీ నీతో చెప్పుకుని
నువ్వు తేలికగా చెప్పే అబద్ధాలన్నీ నిజమని పొగిడితే;
“నిజం సుమీ” అని నెమ్మదిగా మనసులోనే అనుకుని
“ప్రియా! ఎంత నిజం చెప్పావు,” అని పదేపదే చెపుతూ;
సందర్భానికి తగ్గట్టు కళ్ళువాల్చుకుని
నీ నొసలుచిట్లింపులకు ముఖంపాలిపోయేలా భయపడుతూ,
నా మాటల్లో నిన్నెక్కడా ప్రశ్నించనంతవరకు
ప్రియతమా, అప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తావు.
అదే నేను బలహీనురాల్నై, పిచ్చి దానిలా
నా మనసు ప్రతి కుర్రాడితో పంచుకుంటే,
నువ్వు నా గడపదాటిన ప్రతిసారీ
అడుగుల్ని తలకద్దుకుంటే ఫర్వాలేదు;
కానీ, నేను నిను అనుమానించినా, నిను చీదరించుకున్నా,
“నీకో నమస్కారం” అని గట్టిగా అరిచి, నా కాళ్లమీద నిలబడినా
నీ ఆనందానికి విఘాతం కలిగించి, నమ్మకాన్ని వమ్ముచేసినా
బ్రతికుండగా నువ్వు నా వంక చూడవు.
.
డొరతీ పార్కర్
(August 22, 1893 – June 7, 1967)
అమెరికను
.

.
స్పందించండి