తోటలో … హొరేస్ హోలీ, అమెరికను కవి
కురుస్తున్న వర్షానికి తోటలో నిలబడి
నుదురు పైకెత్తి చినుకులని ముఖంపైకి ఆవాహనచేశా.
వావ్! ఎంత మనోల్లాస భావన! ఎక్కడికో జారి పడిపోతున్నట్టు
మేఘాలతో, స్థావరజంగమ ప్రకృతితో,అస్తిత్వ బంధాలతో ఒంటరిగా…
అలాగని ఏదో పోగొట్టుకోడమో, పొందడమో, అయిపోడమో కాదు;
క్షణికమూ అవ్యక్తమూ ఐన ఆత్మానుభూతి,అంతే!
మనసుకలవరపరచి బాధలకుగురిచేసే బంధాలనుండీ
అన్ని అవసరాలనుండీ పరిపూర్ణమైన స్వేచ్ఛ!
‘తేలిపో’ అంటూ అరిచా ఆ క్షణానికి జేజేలుపలుకుతూ!
ఆ నిర్మలానందాన్ని స్తుతించవలసిందే; అది అంతరించినా
ఆ క్షణంలో ఉదయించిన నూతనోత్తేజమూ,
ఉదాత్తభావనలూ శాశ్వతంగా మిగులుతాయి;
పూలతో నా బాంధవ్యం అవగాహన అవడమే కాదు
ఈ వర్షం నాకు తోబుట్టువనీ, ఈ లోయలోని
సమస్త జీవప్రకృతికీ తత్కాల మిత్రుడనీ తెలిసింది.
.
హొరేస్ హోలీ
1887-1960
అమెరికను కవి
.
