నేను చనిపోయిన పిదప… రాబర్ట్ బర్న్స్, స్కాటిష్ కవి
నేను చనిపోయిన పిదప స్పందనలేని ఈ మట్టిమీద
ఆడంబరానికి, లేని దుఃఖాన్ని ప్రదర్శించవద్దు;
బ్రతికున్నప్పుడు నేను ప్రేమించిన నా మిత్రులందరూ
ఒక కన్నీటిబొట్టు వదిలి, నా భార్యాబిడ్డల్ని ఓదార్చొచ్చు.
నేను చనిపోయిన పిదప అపరిచితుల్ని పక్కనుండి పోనీండి.
నా దేశ దిమ్మరి జీవితం గూర్చి హర్షించడానికిగాని
అవమాంచడానికిగాని ఎందుకూ, ఎలా అన్నప్రశ్నలడగనీయొద్దు.
ఆశాశ్వతమైన కీర్తి కుసుమాల్ని నాపై వేయనీయొద్దు.
నేను చనిపోయిన పిదప హత్యాసదృశంగా విమర్శించిన నాలుక
అంతవరకు నాగూర్చిచెప్పిన అబద్ధాలన్నిటినీ మరిచిపోయి
అది చేసిన దాఋణమైన తప్పులన్నిటినీ సరిదిద్దడానికి
వెగటుకలిగేలా రాయడమో, పొగుడుతూ పాడటమో చెయ్యొచ్చు.
నేను చనిపోయిన పిదప ప్రపంచానికి వచ్చే నష్టం ఏమిటి?
ఎప్పటిలాగే అంతులేని దాని గోలలో అది కొట్టుకుంటుంది.
ప్రతివ్యక్తీ జీవనక్రీడలో అలా నిస్సత్తువగా కాళ్ళీడ్చుకుంటూ
ఈ మైదానం నుండి కీర్తినో, దైవాన్నో చేరుకుందికి నిష్క్రమించవలసిందే.
నేను చనిపోయిన పిదప, ఒక వివేకి తన కీర్తి కోసం
నా అస్థికలు ఒక ఉద్యానంలోనో, పట్టణంలోనో పదిలపరచొచ్చు;
ఒకప్పుడు నేను రొట్టెకోసం అలమటించినపుడు లేదన్నా, హతాసుడనై
చలువగమ్మి, గతాసువునైనపుడు చలువరాతి సమాధి కట్టొచ్చు.
.
రాబర్ట్ బర్న్స్2
5 January 1759 – 21 July 1796
స్కాటిష్ మహాకవి
