పెంపుడు పిల్లి… నజీర్ కదొక్కడ్, మలయాళం, ఇండియన్
కుర్చీలో చేరబడి నేను ఏదో చదువుకుంటుంటే
నే నక్కడ ఉన్నానన్న ధ్యాస పిసరంతకూడా లేకుండా
మా పెంపుడు పిల్లి
కుర్చీ కాలుమీద ఏదో గియ్యడం ప్రారంభించింది.
నేనో తన్ను తన్న గానే అక్కడనించి వెళ్ళిపోయింది
సగదూరం వెళ్లి నావంక తీక్ష్ణంగా ఓ చూపు చూసింది
అందులో ఓ బెదిరింపు:
“పంది వెధవా! మరీ అంత తెలివొద్దు” అన్నట్టు
చక్కని దస్తూరీతో రాసింది
ఆ కుర్చీ కర్ర కాలు మీద
“ఓరే మూర్ఖుడా! నీ దిక్కున్నచోటచెప్పుకో!”
అన్న మురికి పిల్లి ముం..!
నే చెయ్యొద్దన్నవి చేస్తూ నా మాట అంత బేఖాతరా?
నేను నిశ్చయించాను
ఈ రాత్రినుండే
కళ్ళుమూసుకుని కమ్మగా అది చప్పరించే
పాలు పొయ్యడం ఆపెయ్యాలని.
మనసులో నిశ్చయించుకున్నాను దీన్నెక్కడో వదిలెయ్యాలని
అదప్పటికప్పుడే వాసనపసిగట్టినట్టుంది
అల్మైరాలోంచి ఒక ఎలకని నోటితో కరుచుకుని
ఠీవిగా బయటకి నడుచుకుంటూ వచ్చింది
ఇంతవరకూ జరిగిందేమీ ఎరగని దానిలా
“ఓ ఎలకపిల్లా! నాకంటికి కనిపించకు”
అని నన్ను తిరస్కారంగా మాటాడినట్టు అనిపించింది.
అది కొంపదీసి అందరికీ వినపడలేదు కద!
అప్పుడు గమనించాను నేను:
నే చదువుతున్న పుస్తకంలో పేజీలు ఆ ఎలక కొరికేసింది.
ఎలకనక్కడ వదుల్తూ,”ఇక్కడ తీరిగ్గా ఆ దిక్కుమాలిన పుస్తకాలేవో
కొరుకుతూ కూచో!” అంది.
అది నన్ను గద్దిస్తుంటే,
మా వంటిల్లు మా ఆవిడ స్వరాన్ని ఎరువుతెచ్చుకుంది.
మా అమ్మాయి,
“అమ్మా నాన్న నిజంగా పుస్తకాలు తినేస్తున్నారే,” అంటూ అరిచింది.
పిల్లి మళ్ళీ ముందుకొచ్చింది.
అచ్చం చిరుతపులిలా.
దాని చూపులన్నీ నా కాళ్లమీదే
పుస్తకం చేతిలోంచి జారిపోయింది.
కుర్చీలోంచి ఒక గెంతు గెంతాను.
అది గోడవారనుండి పరిగెత్తి
కిటికీ ఊచలలోంచి శరీరాన్ని విదుల్చుకుని
పడకగది అద్దంలో ఒక సారి దాని ప్రతిబింబం చూసుకుని
టేబిలు డ్రాయరులో దూరింది.
పిల్లి పడకగదిలోకి వొయ్యారంగా నడుచుకుంటూ వెళ్ళింది
ఈసారి అద్దంలో తీరుబాటుగా తనని చూసుకుంది
మీసాలు ఒక సారి మెలేసుకుని
పరుపుమీద కాళ్ళు బారజాపుకు పడుక్కుంది
నేను గాభరాగా టేబిలు డ్రాయలోని
ఫైళ్ళు ఏమైపోయాయోనని వెదుకుతుంటే.
ఆ పిల్లి
నిద్రలో నవ్వసాగింది (నా గొంతుతో)
ఆమెని దగ్గరగా తీసుకుంటూ
ఆమె అంది
దగ్గరగా జరుగుతూ:
“ఇంట్లో ఎలకలు మరీ ఎక్కువైపోయాయండీ,
మరో పిల్లిని పెంచుకోవాలేమో!”
.
మలయాళ మాతృక: నజీర్ కదొక్కడ్
ఆంగ్ల అనువాదం: రాహుల్ కొచ్చు పరంబిల్
.
- Image Courtesy: http://samkramanam.blogspot.in