ఎక్కడా ఒక చెట్టుగాని, గోపురముగాని, కుటీరంగాని
కనరాని ఏకాంత మైదానాల మీదా, రెల్లుపొదల సరస్సులమీదా…
ఎండిన పచ్చికబయళ్ళమీదా కలయ తిరిగాను
నా ప్రేయసిని కలుసుకుందికి…
ఒకవేళ నా దారిపొడుగునా చక్కని
అపురూపమైన అందాలు పరుచుకున్నా
నా ఆలోచనలు నా చూపుకంటే ముందుగానే
పరుగుతీస్తాయి… ఆమెపై లగ్నమౌతూ.
దేవదారువృక్షకిరీటాలుగల పర్వతాగ్రాలుగాని
సొగసైన సువిశాల రాజప్రాసాదాలు గాని
చివికి మట్టిపాలౌతున్న చక్రవర్తులు నిద్రించే
పిరమిడ్ ల కొనలుగాని నన్ను సంతోషపెట్టవు.
తూర్పుదేశాల మహరాజుల ఉత్సవప్రభలు
నా ముందునుండే నడచిపోవునుగాక, నా దృష్టిని ఆకట్టలేవు.
ఆ వైభవప్రదర్శనని చికాకుతో లిప్తపాటు చూడొచ్చేమోగాని
నీనుండి ఒక్క ఆలోచననీ అవి క్షణమైనా మరల్చలేవు.
.
విలియం షెన్ స్టోన్
18 నవంబరు 1714 – 11 ఫిబ్రవరి 1763
ఇంగ్లీషు కవి
చల్లా సీతారామాంజనేయులు అని విజయవాడలో నాకు 1975 ప్రాంతాల్లో ఒక కవిమిత్రులొకాయన ఉండేవారు. ఆయన చాలా ఫ్రౌఢ కవి. ఈ కవిత చదువుతుంటే ఆయనరాసినదే ఒక కవిత గుర్తుకొచ్చింది:
శ్యామల కోమలోన్మిష వసంత వనాగ్రములెక్కి, గైరికా
క్రామిత తీక్ష్ణశైల శిఖరమ్ములనెక్కి, సుశీతవర్షధా
రామృదుకాలమేఘవిసరమ్ములనెక్కి క్రమింతురా శర
చ్ఛ్రీమకుటోజ్వలార్ద్ర విధురేఖకు నేను కళాత్మనై శివా!…
(“వసంతకాలపు నల్లని మెత్తని చెట్లచిగురులనెక్కి, దట్టంగా పచ్చికపరుచుకున్న కఠినమైన మహాపర్వతాలనెక్కి, చల్లని వర్షధారలు కురిపించే నల్లని మబ్బులగుంపులనెక్కి, నీ జటాజూటంలో మెరిసే చంద్రరేఖకు నేను కళాత్మనై చేరుకుంటానురా, శివా ! ” అని సుమారుగ దాని తాత్పర్యం)
పద్యకవిత … యతిప్రాసలతో అక్షరాలతో ఖాళీలునింపడం చెయ్యకుండా, భావగర్భితంగా భాషమీద పట్టుతో, వినడానికి ఇంపుగా రాయగలిగితే పైన చెప్పినంత అందంగానూ ఉంటుంది. ఈ రోజు అటువంటి ప్రతిభ ఉన్నవాళ్ళు చాలా చాలా అరుదు.
అది పక్కనుంచితే, ఒక విషయం మీద మనసు లగ్నమైతే, ఏదీ దాన్నుండి మనల్ని మరల్చలెదు… అది భక్తి అయినా, రక్తి అయినా. ఈ కవిత చక్కని ఎత్తుబడితో ప్రారంభమై, ఆ భావన కొనసాగుతుంది చివరిదాకా.
.
స్పందించండి