అనువాదలహరి

రెండవ పెళ్ళి … సామ్యూల్ బిషప్, ఇంగ్లండు

ఇదిగో, మేరీ, ఈ ఉంగరం సాక్షిగా

నిన్ను వివాహం చేసుకుంటున్నాను,”…

అని పధ్నాలుగేళ్ళ క్రిందట అన్నాను.

కనుక మరో ఉంగరం కోసం ఎదురుచూడు.

 

దేనికి?”

ఇంక దేనికి?

నిన్ను మళ్ళీ పెళ్ళిచేసుకుందికి. ఏం కూడదా?

ఆ ఉంగరం తొడిగి నీ యవ్వనాన్నీ,

నీ అందచందాల్నీ, అమాయకత్వాన్నీ,

నిజాయితీనీ పెళ్ళిచేసుకున్నాను ఆనాడు.

ఎంతకాలం నుంచో 

అభిరుచుల్ని అభినందిస్తూ 

తెలివితేటలని సమ్మానిస్తూ వచ్చేను

ఒకపక్క నా తెలివితక్కువలు బైటపడుతున్నా. 

 

నేను ఊహించిన దానికంటే రెండురెట్లు 

యోగ్యతగలస్త్రీగా నువ్వు ఋజువుచేసుకున్నప్పుడు

నా ఉద్దేశ్యం నీ రెండురెట్ల తెలివితేటలకి

రెండుసార్లు ప్రమాణం చెయ్య అర్హురాలవని. 

కనుకనే, ఇప్పుడు, ఈ రోజు,

(అప్పటంత విశ్వాసమూ

అంత నిర్మలమూ, గాఢమైన కోరికతో

పురోహితుడి మంత్రాల మధ్య

ఒకరికొకరు ప్రమాణం చేసుకున్నరీతిగానే)

ఓసి నా మనసుదోచుకున్న చిన్నదానా!

రెండోసారి నా ఈ ప్రతిజ్ఞకి సాక్షిగా

ఇదిగో, ఈ రెండవ ఉంగరాన్ని తీసుకొచ్చాను.    

 

మృత్యువు మనల్ని ఎడబాటుచేసేదాకా

నా సుగుణాలఖనిని గుండెకి హత్తుకుంటున్నాను;

పూర్వపరీక్షకి నోచుకోని ఈ సుగుణాలనంటినీ 

పెళ్ళికూతురుకి భార్యగా నువ్వు తోడుచేసినవే

ఒకటొకటిగా అక్కునచేర్చుకున్న నీ సుగుణాలు

వివాహవ్యవస్థనే ప్రీతిపాత్రం చేస్తున్నాయి

నా అంతఃకరణ సాక్షిగా, ప్రేమ సాక్షిగా,

సుఖంతో చొక్కిన ఆత్మ హర్షగీతాలాలపిస్తోంది.   

ఎందుకు?  ప్రతిక్షణం

నీ సౌశీల్యపు ఉదాత్తతా, అనురాగపు శక్తీ

వివేకవంతమైన కార్యదక్షతా 

నిశితవివేచనతో ఇచ్చే సలహా

 గుర్తుచేస్తూ…  

అన్నీ నేర్పుతున్నాయి…

ఒక్క పశ్చాత్తాపం తప్ప.

.

సామ్యూల్ బిషప్

(21 September 1731 – 17 November 1795)

ఇంగ్లండు

.

ఇది ఒక అపురూపమైన ప్రేమ గీతం. ప్రేయసి మీద కాదు… భార్యపై. బ్రతికున్న భార్యపై.  పెళ్ళికి ముందు పురుషులందరూ తమ ప్రేయసులమీద కావ్యగానం చేస్తారు. (లిఖితమూ, అలిఖితమూ). ఈ ప్రేమ జ్వరం సాన్నిహిత్యపు ఔషధంతో చల్లబడుతుంది కాలక్రమంలో. ఒక దశాబ్దపు సాన్నిహిత్యంలో ప్రేమ విలోమంలోకి పయనిస్తుంది… “మిథునం ” లోని ఏ కొద్దిమంది అనురాగజీవులకో తప్ప.   అలాంటి ఒకానొక ప్రేమైక జీవి ఈ శామ్యూల్ బిషప్. (అతను రాసినకవితల్లో తన భార్యపైనా, కూతురిపైనా రాసినవి ఉత్తమంగా ఉంటాయని సంకలనకర్తల అభిప్రాయం. ఈ కవిత ఉత్తమ పురుషలో చెప్పడం నేను ఈ సాహసం చేయ్యడానికి మొదటి కారణం. రెండో కారణం చివరన చెప్పాను.)  ఈ కవితలో “రెండో పెళ్ళి” అన్న పదం వాడి కవి ఒక కొత్త ప్రయోగం చేశాడు. నాకు ఇది చదవగానే మహాకవి కాళిదాసు సినిమాలో “పీడ” అన్న అమంగళకరమైన శబ్దాన్ని శుభాశీస్సుగా మంత్రిగారి అనుచరుడు కాళిదాసు ప్రతిభకి ఆపాదిస్తూ చెప్పిన శ్లోకం గుర్తొచ్చింది.  (ఆసనే పుత్రపీడాచ, బంధుపీడాచ భోజనే, శయనే భర్తృ పీడాచ, త్రిపీడాతు దినేదినే  అని శ్లోకం) అలిసి కూచుందామనుకునే సరికి పిల్లల పీడతోనూ, నెమ్మదిగా భోజనానికి కూచునే సమయంలో బంధువుల పీడతోనూ, ప్రశాంతంగా పడుక్కుందామనేవేళ భర్త పీడతోనూ ప్రతిరోజూ నువ్వు వర్థిల్లువుదువుగాక … అంటే సంతానంతో, సంపదలతో, సౌభాగ్యవతివై వర్థిల్లుదువుగాక… అని ఆ శ్లోకం తాత్పర్యం.

రెండో పెళ్ళి అన్న మాట వాడి తనభార్యని ఆశ్చర్యపరచడమే కాక, దానిని ఎంత ప్రేమాస్పదంగా సమర్థిస్తున్నాడో చదివితీరవలసిందే. “పెళ్ళికూతురికి భార్యగా నువ్వు జోడించిన సద్గుణాలు” అన్నది ఎంతో అనురాగంతో కూడుకున్న ప్రశంశ.   చివరగా, ఈ కవితలోని ఆఖరిమాట తప్ప మిగతా కవితనంతటినీ … బహుశా … సమర్థవంతమైన కవులెవరైనా అనుభవంలో లేకపోయినా ఊహించి రాయగలరేమో! ఈ మాట మాత్రం నా దృష్టిలో అనుభవంలోంచి తప్ప కవితలోకి పొంగిపొర్లలేని విషయం. అదిగుండెలోతులలోంచి మాత్రమే రాగలిగిన ప్రేమైక భావన. “పశ్చాత్తాపం తప్ప” అన్న మాటలోని కవిభావం… “నీ సుగుణాలన్నీ నాకు ఏనాడూ నిన్ను వివాహం చేసుకున్నందుకు బాధపడే అవకాశాన్ని, సందర్భాన్ని, కనీసం ఊహని కలగజెయ్యడం లేదు” అని.

అటువంటి దాంపత్యం ఎంతమనోహరమైనదై ఉండాలి! దాంపత్యం అన్న పదాన్నీ, వివాహ వ్యవస్థపై గౌరవాన్నీ ఇనుమడింపజేస్తాయనడంలో సందేహం ఏముంది?

.

Second Marriage

.

‘Thee, Mary, with this ring I wed,’

So, fourteen years ago, I said—

Behold another ring!—‘For what?’

‘To wed thee o’er again—why not?’

With that first ring I married Youth,

Grace, Beauty, Innocence, and Truth;

Taste long admir’d, sense long rever’d,

And all my Molly then appear’d.

If she, by merit since disclosed,

Prove twice the woman I suppos’d,

I plead that double merit now,

To justify a double vow.

Here then, to-day, (with faith as sure,

With ardour as intense and pure,

As when, amidst the rites divine,

I took thy troth, and plighted mine),

To thee, sweet girl, my second ring

A token, and a pledge, I bring;

With this I wed, till death us part,

Thy riper virtues to my heart;

These virtues, which, before untry’d,

The wife has added to the bride;

Those virtues, whose progressive claim

Endearing wedlock’s very name,

My soul enjoys, my song approves,

For Conscience’s sake, as well as Love’s.

For why?—They show me every hour,

Honour’s high thought, affection’s power,

Discretion’s deed, sound Judgment’s sentence,

And teach me all things—but Repentance

.

Samuel Bishop

(21 September 1731 – 17 November 1795)

Poem Courtesy:  http://www.bartleby.com/333/41.html

The Book of Georgian Verse.  1909. Ed. William Stanley Braithwaite

%d bloggers like this: