ఆమె అంత అందంగా కనపడదు…హార్ట్లీ కోలెరిడ్జ్,ఇంగ్లీషు కవి
చాలామంది కన్నెపిల్లల్లాగే
చూడ్డానికి ఆమె అంత అందంగా కనపడదు;
ఆమె నన్ను చూసి చిరునవ్వు నవ్వేదాకా
ఆమె అంత మనోహరంగా ఉంటుందని అనుకోలేదు;
ఓహ్! అప్పుడు గమనించాను ఆ కళ్ళ మెరుగు
ప్రేమతో ఉప్పొంగుతూ, వెలుగులు విరజిమ్ముతూ.
ఇప్పుడా చూపులు బిడియంతో నిర్లిప్తంగా ఉన్నాయి
నా చూపులకి బదులివ్వడం లేదు;
అయితేనేం? నేను చూడ్డం మానను
ఆమె కళ్ళలోని వెలుగుల్ని;
తక్కిన కన్నియల చిరునవ్వుల కంటే
చిట్లించుకున్నా, ఆమె ముఖమే మెరుగు.
.
హార్ట్లీ కోలెరిడ్జ్
(19 సెప్టెంబరు 1796 – 6 జనవరి 1849)
ఇంగ్లీషు కవి.
సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే కవి మనచిన్నప్పుడు మనమీద ఒక కవిత రాసేడనుకొండి. అది మనం పెద్దయాక చదివితే ఎంత బాగా ఉంటుంది? అటువంటి అరుదైన అదృష్టానికి నోచుకున్న వ్యక్తి హార్ట్లీ కోలరిడ్జ్. అతను రొమాంటిక్ మూమెంట్ రూపశిల్పులలో ఒకడైన సామ్యూల్ టేలర్ కోలరిడ్జ్ కుమారుడు. అతని ఆరో ఏట (1896 లో) To H.C. అని విలియం వర్డ్స్ వర్త్ ఒక కవిత రాసేడు…బాల్యాన్ని స్తుతిస్తూ.
ప్రస్తుత కవిత చూడడానికి సామాన్యంగానే కనిపిస్తుంది. ప్రేమ ఎప్పుడు మనిషిని మెరుపుతీగలా తాకుతుందో తెలీదు. అంతవరకు పెద్దగా పట్టించుకోకుండా చూస్తున్న అమ్మాయి ఒక చిరునవ్వు నవ్వగానే, నవ్వి పలకరించగానే అంతవరకు ఉన్న ఆలోచనలు పోయి కొత్త ఆలోచనలు వచ్చేయి కవికి. ఆమె చిరునవ్వు విద్యుదయస్కాంత క్షేత్రంలోకి జొరబడ్డాడు. అందుకే అంతటా వెలుగులు కనిపించసాగేయి.
ప్రేమకి పెద్ద గొడ్డలిపెట్టు నిర్లిప్తత. ముభావంగా ఉండి, బదులు పలకని ప్రేమ ఒక పరీక్షవంటిది. నిజమైన ప్రేమకి షరతులు, నిబంధనలూ ఉండవు. “నేను ప్రేమించదలచుకున్నాను కాబట్టి ప్రేమిస్తాను. నా ప్రేమకి జవాబు లే(రా)కపోవచ్చు. నేను ప్రేమించడానికి అభ్యంతరం లేదు కదా”… అనుకునేది బదులు ఆశించని ప్రేమ. అదే చెబుతున్నాడు రెండవ పద్యంలో.
ప్రేమ ఒక మదన వికారం కాదు. మనిషిని తన స్పర్శతో ఉదాత్తుణ్ణి చెయ్యగల అమృతలేపనం. అది ప్రపంచాన్ని సరికొత్త కోణంలో దర్శించడానికి మనిషికి లభించే అరుదైన నాలుగవ కన్ను.
.
