కాలిమడమ… విష్ణు ప్రసాద్, మలయాళం, ఇండియన్
సరిగ్గా నా కాలిమడమలో
మేకు దిగిపోయిన నాడే
ఆమె మా యింటికి వచ్చింది.
“మనం అలా కలిసి తిరిగొద్దామా,
ఎక్కడైనా కాస్సేపు కూచుని
కాలక్షేపానికి ఏదో నములుతూ కూచుందామా” అంది.
ఆమె పట్ల ప్రేమతో తలమునకలై ఉన్నానేమో
ఆమె అడగడమే ఆలస్యం,
నా నొప్పి ఊసు ఎత్తకుండా
వెంటనే బయలుదేరాను.
కుంటుకుని కుంటుకుని కాసేపూ,
సాగదీసుకుని నడుస్తూ కాసేపూ
అలా సముద్రతీరం వెంట
ఆమె పక్కనే నడిచాను.
ఆమె నన్ను తనతోపాటు
సముద్రం నీళ్ళలోకి పరిగెత్తి
లాక్కెళుతుందని ఊహించలేకపోయాను.
బాధని పళ్ళబిగువున బంధించి
కాలిని గాలిలోకి ఎత్తుకుంటూ
ఎలాగోలా గెంతుకుంటూ వెళ్ళేను.
చాలా సార్లు నాకు గట్టిగా అరవాలనిపించింది
“దేముడా! నేను పడిపోతానేమో, రక్షించు” అని.
ఆమెకి ఈత కొత్త కాదు.
అందుకని, కెరటానికి కెరటానికీ మధ్య
తనతో ఈడ్చుకుపోయింది నన్ను.
అడుగులు తడబడి
సముద్రం నీళ్ళు మింగేసి
నానిపోయిన నా దెబ్బ మంటపెడుతుంటే
నా గుండె కొట్టుకుంటున్నదొక్కటే:
“అమ్మో నా కాలు
అమ్మో నా కాలు” అని.
చివరికి ఎలాగైతేనేం
అలిసిపోయి
ఊపిరి అందక ఎగశ్వాస వచ్చేసిన నన్ను
ఆమె ఒడ్డుకి లాక్కొచ్చి పడేసి
నామీద విరుచుకు పడింది
“గాడిదా! అప్పుడే నేనంటే నీకు మొహం మొత్తిందా?
నీ కొత్త ప్రియురాలెవరో చెప్పు?” అని గద్దిస్తూ.
మంటపెడుతున్న కాలిని
గాల్లోకి ఎగరేసి విదిలిస్తూ అన్నాను నేను
“నా కాలి మడమ,
నా కాలి మడమ…”
.
విష్ణుప్రసాద్.
మలయాళం,
భారతదేశం.
.