మనలో ఉత్తములైన వారికి కూడా భద్రతాభావాన్ని కలుగజేసే
నిరాశావాదం మీద అంత ఖచ్చితమైన అభిప్రాయముండేది కాదు నాకు.
నా మిత్రులు నన్ను చూసి పరిహసించిన రోజులున్నాయి.
నే నెన్నడూ మాటలమీద అంత పట్టున్నవాడిని కాను.
ఎందుకో, ఓ రకమైన నిర్లక్ష్యం, ఉదాసీనత,
చెప్పదలుచుకున్నది సరిగా చెప్పిన పేరూ లేదు నాకు,
దానికి కారణం చాలా సార్లు చెప్పడానికి ఏమీలేకపోవడమూ
ఏదో చెప్పాల్సి రావడం, ఎవరూ వినకూడదనుకోవడమూ.
నా జీవితం ఒకే ఒక దారప్పోగుకి వేలాడుతోంది.
నాకేమీ అర్థం కావడం లేదని అనిపించిన రోజులున్నాయి.
నా సంకెళ్ళు నీటిమీద తేలియాడుతున్నాయి.
నా కోరికలన్నీ నా కలల్లోంచి పుట్టినవే.
నా ప్రేమని నేను మాటలతో ఋజువుపరుచుకున్నాను.
నన్ను నేను ఎటువంటి అద్భుతమైన ‘జీవరాశి’కి సమర్పించుకున్నాను!
నా ఆలోచనలు నన్ను బలవంతంగా, ఎంత దుఃఖమయమైన ప్రపంచంలోకి బంధిస్తున్నాయి!
నాదైన ఒక వింత ప్రపంచంలో నేను ప్రేమించబడ్డానని నమ్మకంగా అనిపిస్తుంది
నా ప్రేమిక భాష ఈ మానవభాషకి ఎంతమాత్రం చెందదు.
ఈ మానవ శరీరం నా ప్రేమిక శరీరాన్ని తాకనైనా తాకదు.
నా ఆలోచనలలో మోహ వాంఛలు అధికమూ, అనవరతమూ…
అయినప్పటికీ, నన్ను తప్పుచేయడానికి ఏదీ ప్రేరేపించలేదు.
.
పాల్ ఎలూర్
14 December 1895 – 26 November 1952
ఫ్రెంచి కవి
.
సూచన: ఈ అనువాదంలో “ప్రేమిక” అన్న పదం స్త్రీ, పురుషులిద్దరికీ సమంగా వర్తిస్తుంది.
ఈ కవిత చాలా మానసిక విశ్లేషణతో కూడిన కవిత. దీన్ని అర్థం చేసుకుందికి కొంచెం పరిశ్రమ కావాలి. ఈ కవిత Platonic Loveకి ఒక ఉదాహరణ. మొదటివాక్యంలోనే ఒక అద్భుతమైన థీసిస్ ఉంది. “నిరాశావాదం చాలామందికి ఒక భద్రతాభావం ఇస్తుంది”… ఇది ఒక రకంగా Oxymoron. అంటే, పక్కపక్కనే రెండు వైరుధ్యభావనలని చెప్పడం. నిరాశావాదంలో భద్రత ఎక్కడినుండి వస్తుంది? అభద్రతవల్లే కదా నిరాశ వస్తుంది? కాని, ఇందులో కవి చెప్పదలుచుకున్నది, కొందరు ప్రేమించడం కంటే, ప్రేమించామనుకున్న భావనను ప్రేమిస్తారు; లేదా, అవతలి వ్యక్తి నిజంగా ఎంత గాఢంగా ప్రేమిస్తున్నా, వాళ్ళ అసంతృప్తికి కారణం తిరిగి ప్రేమింపబడకపోవడం కాదు; అంతకుమించి వాళ్ళు కోరుకుంటున్నదేదో వాళ్ళకి దొరకకపోవడం.
మొదటి పద్యాన్ని, రెండవపద్యాన్ని ఇప్పుడు పోల్చి చూడండి. కొంతమంది ప్రేమని ప్రకటించేటప్పుడు మాటలు ఆచి తూచి వాడతారు. అంటే, వాళ్ల మనసులో ఉన్న ఆలోచనలు బహిర్గతమవకుండా ప్రయత్నిస్తారు. అందుకే “వాళ్ళు పరిహసించిన రోజులున్నాయని కవి అంటాడు. నాకు మాటలమీద అంతపట్టులేదనీ, చెప్పదలుచుకున్నది సరిగా చెప్పగలిగిన పేరూ లేదనీ” అంటాడు. నిజానికి ప్రేమని ప్రకటించడానికి భాష ఆవశ్యకం కాదు, ఒక ఉపకరణం. “చాలా సార్లు చెప్పడానికి ఏమీ ఉండదు” అందుకని అతనికి భాషమీద పట్టు లేకపోయినా అది ఒక అవరోధం కాదు. అయినా, ఆ మాటాడేది కూడా ఏదో మాటాడాలి కాబట్టి. అది వినకపోయినంత మాత్రం చేత వచ్చిన నష్టం కూడ లేదు. ఎందుకంటే ప్రేమికులు ఒకరి సమక్షంలో ఒకరు, మాటాడిన విషయాలకంటే, మాటాడకుండా ఒకరితో ఒకరు సంభాషించుకునే విషయమే ఎక్కువ ఉంటుంది. Just you feel like spending eternity in the presence of your love… without speaking a word. అ సామీప్యం ఇచ్చే ఆనందం అటువంటిది.
తర్వాత పద్యంలో కవి తన మానసిక వ్యధను వెళ్ళగక్కుతున్నాడు. జీవితం ఒక దారప్పోగుకి వేలాడుతోంది… అంటే డెమొకిల్స్ కత్తిలాటిది కాదు. (అది జీవితాన్ని నిత్యం భయంతో ఉంచేది). ఇది గాలిపటంలాగ స్వేచ్ఛగా ఎగరడం లాటిది… ఒకే ఒక దారప్పోగుతో. నిజమైన ప్రేమ జీవితాన్ని తేలిక పరుస్తుంది. ఆ ప్రేమ అవతలి వ్యక్తినుంచి వచ్చేది కాదు… మనం అనుభవించే ప్రేమభావన. మనకు కలిగే ప్రేమభావన. అటువంటి మానసిక స్థితిలో మనం ఉన్నప్పుడు, లేదా ఉండగలిగినప్పుడు, “ప్రేమిక” భాషకూడా అలౌకికంగా కనిపిస్తుంది. ఆ స్నేహం, ఆ ప్రేమా, భౌతికపరిమితులుదాటి భద్రంగా దాచుకోవాలనిపిస్తుంది. అదికూడా చెబుతున్నాడు కవి. నిజానికి అవతలివ్యక్తి మనం అనుకున్నంతగా మనల్ని ప్రేమించకపోవచ్చు. మనకి నిజానికి ఆనందం ఇచ్చేది అవతలివ్యక్తి మనల్ని అమితంగా ప్రేమిస్తున్నారని మనం మనసులో అనుకునే భావన. More than the other person loving us, we will be elated with our conception of other person loving us.
అలాగని ఇద్దరు స్త్రీపురుషుల స్నేహంలో శరీరక వాంఛలకి చెందిన భావనలు ఉండవా? ఉంటాయి. నైతిక ప్రమాణాలతో చూస్తే ఆ భావనలు అంత స్వచ్ఛమైనవేం కావు. అంతమాత్రంచేత అవి నిష్కల్మషంగా అవతలివ్యక్తితో ప్రవర్తించడానికి అడ్డురావు… ఒక ఆలోచన ఒక ఆలోచన. అంతే. అది ఆచరణ కాదు. ఆలోచనలని నియంత్రించలేము. కానీ మన ప్రవర్తనని మనం అదుపులో ఉంచుకోగలం. కానీ ఎప్పుడు? అటువంటి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోగలిగినప్పుడు. అలా ఉంచుకోగలిగినవారికే ఈ Platonic Love అర్థం కాగలదు.
ఇంతకీ, ఈ కవితకి కిటికీ అని శీర్షిక ఎందుకు పెట్టినట్టు? కిటికీ మనసుకి, మన అంతర్లోచనకి ఒక ప్రతీక. కిటికీలోంచి అన్ని ఇష్టమైన వస్తువుల్నీ చూస్తుంటాం. కానీ మనకు వాటిని అందుకోవాలన్న గాఢమైన కోరిక ఉండదు. అందలేదన్న నిరాశ ఉండదు. అందులోంచి వస్తువుల్ని పదే పదే చూస్తూ ఆనందించగలుగుతాం. అది ఒక రకమైన మానసిక ప్రేమ.