యామినీ గీతం… విలియం రాస్కోథేయర్, అమెరికను కవి
అనంత శక్తిమయివై, విశ్వపరీవ్యాప్తమై, అపారనీరవాన్ని మోసే యామినీ!
మనుషి ఏనాటికైనా సాధ్యపడితే, నీవల్లే దైవం పరిమితి తెలుసుకుంటారు.
అహంకారియైన సూర్యుడు అసూయతో తనముఖాన్ని చాటుచేసుకుంటున్నాడు
లక్షలసూర్యుల్నీ, పాలపుంతనీ నువ్వు ప్రకాశించమని ఆదేశిస్తావు.
ప్రతి తారకా లెక్కలేని గ్రహాలకి వెలుగూ, వేడిమీ, చలనమూ అనుగ్రహిస్తుంది
అతిదగ్గరనుండి అనంతదూరం వరకూ, అన్నిచుక్కల్నీ కొంగులో దాచుకోగలవు,
అన్ని కోట్ల సూర్యప్రభలూ నీ పాదాల క్రిందనలిగే ముచ్చిరేకులు; కేవలం
మండుతున్న పూసలు; తిరుగుతూ, తేలుతూ, మెరిసిపడే బుద్బుదాలు.
విలియం రాస్కో థేయర్
(January 16, 1859 – 1923)
అమెరికను కవి.
ఈ కవితలో సౌందర్యం ఒక సైన్సు విషయాన్ని తీసుకుని కవి తన ఆధ్యాత్మిక భావనకు లంకెవెయ్యడం. ఇందులో సూర్యుడు అసూయపడడం అన్నమాట గమనించదగ్గది. మొదట్లో భూమి కేంద్రకంగా సృష్టి అంతా పరిభ్రమిస్తోందని అనుకుంటే, సూర్యుడు కేంద్రకం అని తర్వాతి పరిశోధనలు తేల్చాయి. అయితే, అదెన్నాళ్ళో నిలవలేదు. సూర్యుడి ఏకైక ప్రతిపత్తిని పక్కనబెడుతూ అనేక వేల సూర్యుళ్ళున్నారనీ, ప్రతి సూర్యుడిచుట్టూ మన సౌరవ్యవస్థలాటివే ఉన్నాయని తేలడంతో, సూర్యుడు చిన్నబోయాడు. అసూయ కలిగింది. ఇక్కడ 1846 సెప్టెంబరు 23న నెప్ట్యూన్ గ్రహాన్ని కనుక్కోవడమూ, 1859లో రాబర్ట్ బున్సెన్, గుస్తావ్ కిర్చాఫ్ ఇద్దరూ కలిసి సూర్యుడిలోంచి పట్టకంద్వారా విశ్లేషించినపుడు వచ్చే వర్ణపటలమూ, ప్రయోగశాలలో రసాయనిక ద్రవ్యాల్ని మండించినపుడు వచ్చే వర్ణపటలాలూ సరిపోల్చదగ్గవని చేసిన ఒక అపురూపమైన ఆవిష్కరణా ఖగోళ శాస్త్రం మీద యువతరానికి ఉత్సాహం కలగడానికి ప్రేరణలైనాయని మనం గుర్తుపెట్టుకోవాలి. దాని పర్యవసానంగా,కవిత్వంలోకి ఖగోళశాస్త్రవిషయం దొర్లడం సహజమే.
.

Image Courtesy: http://www.jssgallery.org/Paintings/Mugs/Wm_Roscoe_Thayer.html