సన్నిహితులు … D.H. లారెన్సు, ఇంగ్లీషు కవి.
నా ప్రేమంటే నీకు ఏమాత్రం లక్ష్యం లేదా?
అని అడిగిందామె నిష్టూరంగా.
ఆమె చేతికి అద్దాన్ని అందిస్తూ అన్నాను:
ఈ ప్రశ్నని అడగవలసినవాళ్ళని అడుగు!
నీ విజ్ఞాపనలని కేంద్ర కార్యాలయానికే పంపు!
భావావేశ ప్రాధాన్యత ఉన్న విషయాలలో
మీరు నేరుగా అత్యున్నత అధికారినే సంప్రదించవలెను…
అని చెప్పి అద్దాన్ని చేతికి అందించేను.
దాన్ని నాబుర్రకేసి పగలగొట్టి ఉండేదే,
కాని అంతలో తన ప్రతిబింబాన్ని చూడ్డం తటస్థించింది.
అది, రెండు సెకెన్లపాటు ఆమెని మంత్రముగ్ధురాలిని చేసింది.
ఆ సమయంలో నేను చల్లగా జారుకున్నాను.
.
D.H. లారెన్సు,
11 September 1885 – 2 March 1930
ఇంగ్లీషు కవి.
.
ఇది చాలా చిలిపి కవిత. ఇంత చిన్న కాన్వాసులోనే, ఆమె అందంగా ఉంటుందనీ, తనని (కవిని) ప్రేమిస్తోందనీ, తనకంటే కూడా, ఆమె తన అందానికి ముగ్ధురాలైపోతుందనీ కవి సమర్థవంతంగా చెప్పేడు. ఇక్కడ, నిజంగా సన్నిహితులెవరంటే… ‘కవి- ఆమె ‘ కాదు; ‘ఆమె- ఆమె ప్రతిబింబమూ’. అందమైన స్త్రీ (పురుషు)లకుండే సహజమైన బలహీనతని కవి చాలా గమ్మత్తుగా ఆవిష్కరించేడు.
.

.