ముత్యపుపడవలో వీనస్… ఏమీ లోవెల్, అమెరికను

ఒక విషయం చెప్పు నాకు,
ముత్యపుచిప్ప పడవలో
ముడుతలుపడుతున్న అలలమీద తేలుతూ
తీరానికి కొట్టుకొస్తున్న వీనస్
నీకంటే అందంగా ఉందా?
ఏమిటి, బోట్టిచెల్లీ* చూపు
నాకంటే గొప్పగా అంచనా వెయ్యగలదా?
ఆమెపై అతను విసిరిన
రంగుపూసిన గులాబి మొగ్గలు
వెండిజరీ ముసుగులో
నీ అపూర్వ సౌందర్యం దాచడానికి
నీపై వెదజల్లుతున్న
నా అక్షర సుమాలకంటే విలువైనవా?
నా మట్టుకు నువ్వు
వినీలాకాశంలో తేలియాడుతూ
వెలుగులవడ్డాణం ధరించి
కిరణాలమీద చిద్విలాసంగా నడవడానికి
సన్నద్ధంగా ఉన్నావు.
నీకు ముందు పరిగెత్తుతున్న కెరటాలు
నీ పాదాల క్రింది ఇసకరేణువులని
అలలచే తుడిపిస్తున్నాయి.
.
ఏమీ లోవెల్
February 9, 1874 – May 12, 1925
అమెరికను.
.
*బోట్టిచెల్లీ (1445 – May 17, 1510). పైన ఇచ్చిన సాండ్రో బోట్టిచెల్లీ వీనస్ చిత్రం ఇటాలియన్ రినైజాన్సు కాలంనాటి ఒక అద్భుతమైన కళాఖండంగా పేరుగాంచింది.
